బౌండరీలతో ఆకట్టుకున్న రాహుల్:
ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. రెండో రోజు ఆటను భారత్ నెమ్మదిగా ఆరంభించింది. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని చెలరేగినా.. రోహిత్, రాహుల్ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక స్ట్రైక్ రొటేట్ చేశారు. ఆపై చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తూ.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ముఖ్యంగా రాహుల్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అయితే రోహిత్ (36; 107 బంతుల్లో 4x6) జట్టు స్కోర్ 97 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. ఆపై చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ అజింక్య రహానేలను స్వల్ప వ్యవధిలో కోల్పోయిన భారత్.. పీకల్లోతు కష్టాల్లో పడింది.
రాహుల్ ఆడకుంటే:
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. కేఎల్ రాహుల్ మాత్రం క్రీజులో నిలబడి ఇంగ్లీష్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. రాహుల్ వికెట్ కోసం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ పదేపదే బౌలర్లను మార్చినా.. ఫలితం లేకుండా పోయింది. ఒకవైపు డిఫెన్స్ ఆడుతూ.. మరోవైపు చెత్త బంతులను శిక్షించాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ అండతో రాహుల్ టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. పంత్ ఔట్ అయిన అనంతరం రవీంద్ర జడేజాతో జతకట్టిన రాహుల్.. టీమిండియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రాహుల్ జోరు చూస్తే.. సెంచరీ చేస్తాడనిపించింది. కానీ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఒకవేళ రాహుల్ ఆడకుంటే.. భారత్ కూడా 150-180 పరుగులకే ఆలౌట్ అయ్యేది.
టీమిండియాకే నష్టం:
మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కర్ణాటక బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ మాజీలు, కామెంటేటర్లు రాహుల్‌ను ఆకాశానికెత్తేశారు. కేఎల్ రాహుల్ క్లాస్ బ్యాట్స్‌మన్ అని పేర్కొంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో టీమిండియా ఫాన్స్, నెటిజన్లు రాహుల్‌ను ప్రశంసిస్తూన్నారు. ప్రస్తుతం నెట్టింట రాహుల్ పేరు మార్మోగిపోతోంది. 'కేఎల్ రాహుల్ అన్ని ఫార్మాట్లలో ఆడటానికి అర్హుడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు శిఖర్ ధావన్ లాగా రాహుల్ కూడా పెద్ద ఆటగాడు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఇకనుంచి కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకోకుంటే.. టీమిండియాకే నష్టం. అతడికి మాత్రం కాదు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'రాహుల్ సెంచరీ చేయకపోయినా.. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు', 'కేఎల్ రాహుల్ ప్రశంసలకు అర్హుడు. 84 పరుగులు చేసిన రాహుల్‌కు స్వాగతం' అని కామెంట్ల వర్షం కురుస్తోంది.
2018లో విఫలం:
2018లో ఇదే ఇంగ్లండ్‌లో పది ఇన్నింగ్సుల్లో కేఎల్ రాహుల్ కేవలం ఒకే ఒక్క సెంచరీ (149) చేశాడు. ఆ పర్యటనలో రాహుల్ 4, 13, 8, 10, 23, 36, 19, 0, 37తో పూర్తిగా విఫలమయ్యాడు. అప్పటి నుంచి అతడిని భారత సెలెక్టర్లు పక్కనపెట్టారు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా కుదురుకోవడంతో మనోడికి అవకాశాలు రాలేదు. మరోవైపు శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాల రూపంలో యువ ఆటగాళ్లతో పోటీ కూడా నెలకొంది. అయితే గాయాల కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన మయాంక్, గిల్‌లు స్వదేశానికి చేరుకున్నారు. ఈ రూపమ్లో వచ్చిన అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకున్నాడు. ప్రస్తుత టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు 84 పరుగులు చేసి సత్తాచాటాడు.
70 పరుగుల ఆధిక్యంలో భారత్:
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకు వరణుడు పదేపదే అడ్డుపడుతున్నాడు. రెండో రోజులో ఒక సెషన్‌ను తుడిచిపెట్టుకుపోయిన వర్షం.. మూడో రోజులో సగం రోజు ఆటను మింగేసింది. మూడో రోజైన శుక్రవారం ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 11.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (11), డామ్ సిబ్లీ (9) క్రీజులో ఉన్నారు. ఇప్పటికి భారత్ 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (84; 214 బంతుల్లో 12x4), రవీంద్ర జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధ శతకాలతో రాణించగా.. చివరలో జస్ప్రిత్ బుమ్రా (28; 34 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడాడు. ఇంగ్లీష్ బౌలర్లలో ఓలి రాబిన్‌సన్ 5, జేమ్స్ అండర్సన్ 4 వికెట్లు పడగొట్టారు.


Click it and Unblock the Notifications












