ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (104; 147 బంతుల్లో) సెంచరీతో సత్తాచాటడంతో ఇంగ్లండ్‌కు భారత్ 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటివరకు ఏ జట్టు ఆసియాలో ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించినట్లు చరిత్రలోనే లేదు. 2021లో బంగ్లాదేశ్‌లో బంగ్లాపై వెస్టిండీస్ సాధించిన 395 పరుగులే అత్యధికం.
ఇక భారత్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు చేసిన అత్యధిక పరుగులు 299 మాత్రమే. ఇంగ్లండ్ విషయానికొస్తే ఆ జట్టు అత్యధిక స్కోరు 241 పరుగులు. ఈ గణాంకాలు చూస్తే వైజాగ్ టెస్టులో భారత్‌కు ఇక తిరుగులేనట్లే! అయితే బజ్ బాల్‌తో ఇంగ్లండ్ చరిత్ర సృష్టిస్తుందా లేదా భారత్‌కు తలవంచుతుందా అని చూడాలి.

ఓవర్‌నైట్ స్కోరు 28/0తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ ఎదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (13; 21 బంతుల్లో), డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్ (17; 27 బంతుల్లో)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టస్థితిలో నిలబెట్టారు. కానీ బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌కు శ్రేయస్ వెనుదిరగాల్సి వచ్చింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ (9) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో)తో కలిసి గిల్ మరోసారి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయిదో వికెట్ 89 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గిల్ శతకాన్ని అందుకున్నాడు. వరుస వైఫల్యాలను అధిగమించి గిల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు.రవిచంద్రన్ అశ్విన్ (29; 61 బంతుల్లో) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. భరత్ ఆరు పరుగులతో నిరాశపరిచాడు. కుల్‌దీప్ యాదవ్, బుమ్రా డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హర్ట్‌లీ నాలుగు వికెట్లు, రెహాన్ అహ్మద్ మూడు, అండర్సన్ రెండు వికెట్లతో సత్తాచాటారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు, ఇంగ్లండ్ 253 పరుగులు సాధించింది.