IND vs ENG:'నాలుగో టెస్ట్ కోసం కోహ్లీ భారీ మార్పులు చేస్తాడని ఆశించొద్దు.. ఆ ఒక్కడినే తీసుకునే అవకాశం ఉంది'

ఇస్లామాబాద్: సెప్టెంబర్ 2 నుంచి ఆరంభం అయ్యే నాలుగో టెస్టు కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ మార్పులతో బరిలోకి దిగుతాడని ఏమాత్రం ఆశించొద్దని పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ అన్నాడు. మూడో టెస్టు ముగిసిన అనంతరం ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి కోహ్లీ మాట్లాడలేదని, జట్టు సమష్టి కృషి గురించే మాట్లాడాడన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాతే కోహ్లీ జట్టులో సమూల మార్పులు చేయవచ్చని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

భారీ మార్పులు చేయడు:
తాజాగా సల్మాన్ బట్ తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ... 'మూడో టెస్ట్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాను. అతను ఓవల్ టెస్ట్ కోసం భారీ మార్పులు చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే.. మ్యాచ్ ఓడినా కూడా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి కోహ్లీ మాట్లాడలేదు. జట్టు సమష్టి కృషి గురించే మాట్లాడాడు. కోహ్లీ ఏ ప్రత్యేక ఆటగాడిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడలేదు. ఇది మంచి లక్షణం. గెలిచినా ఓడినా కోహ్లీ ఇలా మాట్లాడడం బాగుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాతే కోహ్లీ జట్టులో మార్పులు చేర్పులు చేయవచ్చు అని నేను భావిస్తున్నా' అని అన్నాడు.

అశ్విన్‌ను తీసుకోవచ్చు:
'ఆసియా నుంచి వచ్చిన ఏ బ్యాట్స్‌మన్ అయినా ఇంగ్లండ్ లాంటి పరిస్థితుల్లో కుదురుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు భారత జట్టులోకి కొత్తగా ఎవరిని తీసుకున్నా.. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఇదే జట్టుతో మిగతా మ్యాచులు ఆడవచ్చు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అదనపు బ్యట్స్‌మెన్‌తో బరిలోకి దిగే ఉద్దేశమేమీ లేదని విరాట్ కోహ్లీనే ఇప్పటికే స్పష్టం చేశాడు. కాబట్టి 7వ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకునే అవకాశం లేదు. మొత్తానికి బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు' అని పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు.

పంత్ ఇలాగే ఆడితే కష్టం:
'రిషబ్ పంత్ ఇలాగే ఆడితే టెస్టుల్లో ఏమాత్రం విజయవంతం కాలేడు. అతడు కాస్త ఓపికతో ఆడాలి. దాంతో పాటు రక్షణాత్మక ధోరణి కూడా అలవర్చుకోవాలి. పంత్ అమ్ములపొదిలో ఎన్నో వైవిధ్యమైన షాట్లు దాగున్నా.. డిఫెన్సివ్ మెకానిజం మాత్రం అంత మెరుగ్గా లేదు. ముఖ్యంగా ఇంగ్లండ్ పిచ్‌లపై ఇలాంటి బ్యాటింగ్ అస్సలు పనికిరాదు. భారత్, ఆస్ట్రేలియా దేశాల్లో పంత్ విజయవంతమైనా.. ఇక్కడ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆయా దేశాల్లో బంతి అంతగా స్వింగ్ అవ్వదు. ఈ నేపథ్యంలో పంత్ ఇప్పుడు ఆడుతున్న ఆటతీరు బట్టి బంతి ఎక్కడైతే స్వింగ్ అవుతుందో, సీమ్‌కు అనుకూలిస్తోందో ఆ సవాళ్లను ఎదుర్కోలేడు' అని సల్మాన్ చెప్పుకొచ్చాడు. బట్ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

సెప్టెంబర్ 2 నుంచి:
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం ముగిసిన మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రూట్ సేన.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగాల్సి ఉంది. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్ట్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications