టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ ఆగమనం అదిరింది. అరంగేట్ర టెస్టులోనే నిప్పులు చెరిగే బంతులతో అతడు సత్తాచాటుతున్నాడు. ఆకాశ్ దీప్ ధాటికి నాలుగో టెస్టు తొలి రోజు ఆట మొదటి సెషన్‌లోనే ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడానికి పోటీపడ్డారు. తన తొలి స్పెల్‌లోనే మూడు వికెట్లు తీసి తానెంతటి ప్రమాదకర బౌలరో ప్రపంచానికి ఆకాశ్ దీప్ చాటిచెప్పాడు.
అయితే రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ప్రారంభమైన కాసేపటికే జాక్ క్రాలేను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అప్పటికీ అతడికి అది రెండో ఓవర్ మాత్రమే. అయినా నిరుత్సాహపరకుండా సత్తాచాటాడు. తన అయిదో ఓవర్‌లో వికెట్ల మోత మొదలుపెట్టాడు. దీని గురించి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం ఆకాశ్ దీప్ మాట్లాడాడు.

''అరంగేట్ర మ్యాచ్ అని నేనేం భయపడలేదు. మా కోచ్, సిబ్బందితో మాట్లాడాను. అందుకే ఎలాంటి టెన్షన్ అనిపించలేదు. ఇదెలా జరిగిందో తెలియదు. కానీ ప్రతి మ్యాచ్‌ను చివరి మ్యాచ్‌గానే నేను భావిస్తా. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. లెంగ్త్ విషయంలో బుమ్రా సలహా ఇచ్చాడు. కొంచెం మార్చుకోమని సూచించాడు. అదే ఇవాళ ఆటలో ప్రదర్శించా''
''ఇక నో బాల్ విషయానికొస్తే.. తప్పు చేశా అనిపించింది. దాని వల్ల టీమిండియా కష్టాల్లో పడొద్దనుకున్నా. మ్యాచ్ ఓటమికి కారణం కాకూడదనుకున్నా. ఎందుకంటే ఆ తర్వాత జాక్ క్రాలే బాగా ఆడాడు. అయితే ఆట ప్రారంభమైన ఆదిలో వికెట్ సహాయపడింది. కానీ ఆ తర్వాత బాల్ సాఫ్ట్ అయింది. దాంతో పాటు వికెట్ చాలా స్లో అయింది. అయినప్పటికీ మా బౌలర్లతో శ్రమించాం. సరైన ప్రదేశాల్లో బంతులు విసురుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాం'' అని ఆకాశ్ దీప్ అన్నాడు.
నో బాల్‌తో బతికిపోయే సమయానికి జాక్ క్రాలే 16 బంతుల్లో 4 పరుగులే చేశాడు. ఆ తర్వాత 42 బంతుల్లో 42 పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లోనే మరోసారి బౌల్డయ్యాడు. కాగా, శుక్రవారం ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (106*; 226 బంతుల్లో) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. అతడికి తోడుగా క్రీజులో ఒలీ రాబిన్సన్ (31*; 60 బంతుల్లో) ఉన్నాడు.
భారత్ బౌలర్లలో అకాశ్ దీప్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.