IND vs ENG: మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజున భారత పేసర్ మహ్మద్ సిరాజ్, ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ల మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ పరిస్థితి
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కోసం నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యశస్వి జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (61), రిషబ్ పంత్ (54) అర్థసెంచరీలతో 358 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరపున కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు, ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 166 పరుగులు జోడించారు. భారత బౌలర్లు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడటంతో మైదానంలో ఉద్రిక్తత పెరిగింది.

మహ్మద్ సిరాజ్- బెన్ డకెట్ ఘర్షణ
మ్యాచ్‌లోని మూడో సెషన్‌లో ఈ ఘటన జరిగింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు.. అతనికి, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బెన్ డకెట్‌కు మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. బెన్ డకెట్ సిరాజ్‌ను చూసి కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత సిరాజ్ కోపంగా డకెట్ వైపు వేలు చూపించి మాట్లాడిన వీడియో.. దానికి డకెట్ కూడా ఏదో బదులిచ్చిన వీడియో కెమెరాలో రికార్డు అయింది. ఆ తర్వాత అంపైర్ పరుగున వచ్చి ఇద్దరినీ శాంతింపజేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడం ఇది తొలిసారి కాదు. ఈ వాగ్వాదాల మధ్య కూడా బెన్ డకెట్ తన అద్భుతమైన ఆటను కొనసాగించాడు. అతను 100 బంతుల్లో 13 ఫోర్లతో 94 పరుగులు చేసి సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
అరంగేట్ర ఆటగాడు అన్షుల్ కంబోజ్ అద్భుత ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు అరంగేట్రం చేసిన హర్యానాకు చెందిన పేసర్ అన్షుల్ కంబోజ్, తన తొలి టెస్ట్ వికెట్‌గా బెన్ డకెట్‌ను ఔట్ చేసి అదరగొట్టాడు. కంబోజ్ బౌలింగ్‌లో డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ సరిగ్గా అందుకున్నాడు. దీని ద్వారా, టెస్ట్ క్రికెట్‌లో వికెట్ తీసిన నాలుగో హర్యానా పేసర్‌గా అతను గుర్తింపు పొందాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి బలమైన స్థితిలో ఉంది. భారత్ కంటే కేవలం 133 పరుగుల వెనుకబడి ఉంది. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది.