వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 67/1తో సోమవారం ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో భారత్ బౌలర్లు చెలరేగి అయిదు వికెట్లు పడగొట్టడం విశేషం.
గత టెస్టు హీరో ఒలీ పోప్ (23; 21 బంతుల్లో), దిగ్గజ ప్లేయర్ జో రూట్ (16; 10 బంతుల్లో)ను అశ్విన్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. అయితే సోమవారం ఆటలో వికెట్ల వేట ప్రారంభించింది అక్షర్ పటేల్. నైట్ వాచమన్ రెహాన్ అహ్మద్ (23; 31 బంతుల్లో)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.

కానీ జానీ బెయిర్‌స్టో (26; 36 బంతుల్లో)తో కలిసి ఓపెనర్ జాక్ క్రాలే (73; 132 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. 194/4తో మెరుగైన స్థితితో లంచ్ బ్రేక్‌కు దగ్గరగా వచ్చారు. కానీ ఆ తర్వాత టీమిండియా పుంజుకుని వరుస ఓవర్లలో వికెట్లు సాధించింది. రోహిత్ బౌలింగ్ మార్పులు సత్ఫలితాలు ఇచ్చాయి.
క్రాలేను కుల్‌దీప్ యాదవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే అంపైర్ తొలుత ఔట్ ఇవ్వలేదు. రోహిత్ రివ్యూకి వెళ్లడంతో భారత్ వికెట్ సాధించుకుంది. అనంతరం బుమ్రాకు రోహిత్ బంతి ఇవ్వడం కూడా టీమిండియాకు కలిసొచ్చింది. బెయిర్ స్టోను బుమ్రా ఔట్ చేశాడు. అంతేగాక స్లిప్‌లో రోహిత్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. రెప్పపాటులో వచ్చిన బంతిని సమయస్ఫూర్తిగా ఒడిసిపట్టాడు.
ఈ నేపథ్యంలో వ్యాఖ్యాతగా ఉన్న హర్హా భోగ్గే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ రోహిత్‌కు ఎంతో కలిసొస్తుందని, అతడు పట్టిందల్లా బంగారమే అవుతుందని అన్నాడు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 214/6. రెండో సెషన్‌లో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా పోరాడుతున్నారు. అయితే వీరిద్దరూ ప్రమాదకర బ్యాటర్లే. కాగా, విజయానికి ఇంగ్లండ్ 185 పరుగులు, భారత్ నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాయి.