
లండన్: ఐదు టెస్ట్ సిరీసులో భాగంగా లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. వర్షం కారణంగా టాస్ 20 నిముషాలు ఆలస్యం అయింది. రెండో టెస్ట్ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. వరుసగా విఫలమవుతున్న జాక్ క్రాలీ, డేనియల్ లారెన్స్ స్థానంలో హసీబ్ హమీద్, మొయిన్ అలీ జట్టులోకి వచ్చారు. గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయిన సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బదులు మార్క్ వుడ్ ఆడనున్నాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో ఒక మార్పు చేశాడు. గాయపడిన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు. దీంతో స్పెసలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు నిరాశే ఎదురైంది.
వరుణుడి అంతరాయంతో నాటింగ్‌హామ్ టెస్టులో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన కోహ్లీసేన.. మలి టెస్టులో ఇంగ్లండ్‌పై పంజా విసరాలని చూస్తున్నది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తాచాటేందుకు భారత్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది. అయితే బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాను వేధిస్తున్నది. టాపార్డర్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రాగా మిడిలార్డర్ సమయోచిత పాత్ర పోషించడం లేదు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం లేదు. సీనియర్లు అయిన చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ బ్యాట్లు ఝులిపించడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే లోయర్ ఆర్డర్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉన్న శార్దుల్‌కు గాయం కావడం తుది జట్టు ఎంపికపై ప్రభావం చూపింది.
జేమ్స్ అండర్సన్‌తో కలిసి ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న స్టువర్ట్ బ్రాడ్ గాయంతో మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. మంగళవారం ప్రాక్టీస్ సమయంలో బ్రాడ్ కండరాలు పట్టేశాయి. దీంతో సిరీస్‌లో మిగిలిన టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. బ్రాడ్ గైర్హాజరీలో అండర్సన్, మార్క్ వుడ్, ఓలి రాబిన్సన్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. ఇదిలా ఉంటే బ్రాడ్ గాయాన్ని దృష్టిలో పెట్టుకుని లాంకషైర్ సీమ్ బౌలర్ సకీబ్ మహమూద్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకుంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, జొస్ బట్లర్, సామ్ కరన్, ఓలీ రాబిన్‌సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.