రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే 134 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురెల్ (30*; 58 బంతుల్లో), కుల్‌దీప్ యాదవ్ (17*; 72 బంతుల్లో) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది.
అయితే టీమిండియా ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ (73; 117 బంతుల్లో) ఔట్ అప్పీలు విషయంలో ఇంగ్లండ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. క్రీడాస్ఫూర్తితో ఆడాలని ఇంగ్లిష్ జట్టును నెటిజన్లు విమర్శిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. అసలేం జరిగిదంటే.. 20వ ఓవర్‌లో రాబిన్సన్ ఆఖరి బంతికి జైస్వాల్ షాట్ ఆడాడు. అయితే బ్యాటుకు ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వద్దకు వెళ్లింది. ఫోక్స్ ముందుకు డైవ్ చేసి క్యాచ్‌ను అందుకున్నాడు.

కానీ గ్రౌండ్‌పై తాకిన తర్వాత బాల్ ఫోక్స్ గ్లవ్స్‌కు చేరింది. గ్లవ్స్ లోపల భాగం గ్రీన్ కలర్‌లోనే ఉండటంతో ఔట్ గురించి నిర్ణయం తీసుకోవడానికి అంపైర్లు చాలాసేపు పరిశీలించారు. మైదానంలో ఉన్న గడ్డితో గ్లవ్స్ కలర్ కలిసిపోవడంతో అంపైర్ సమయాన్ని తీసుకున్నాడు. చివరికి నేలపై తాకిన తర్వాతనే బంతిని ఫోక్స్ అందుకున్నాడని స్పష్టమైంది. దీంతో జైస్వాల్ నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు అంపైర్ నిర్ణయాన్ని ఊహించని ఇంగ్లండ్ షాక్‌కు గురైంది.
అయితే క్యాచ్‌ను అందుకునే క్షణంలో బంతి నేలకు తాకిన విషయాన్ని ఫోక్స్‌కు తెలిసినా బయటకు వెల్లడించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో తమకు అనుకూలమైన నిర్ణయాలు రావాలని ఉద్దేశపూర్వకంగానే గ్లవ్స్ లోపల గ్రీన్ కలర్ ఉపయోగిస్తున్నారని, తొండాట ఆడుతున్నారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరికొందరు ఇవాళ జరిగిన సంఘటనను ఉటంకిస్తూ ఇంగ్లండ్ క్రీడాస్ఫూర్తితో వ్యవహిరించాలని కామెంట్లు చేస్తున్నారు.
శనివారం ఆటలో స్లిప్‌లో ఉన్న రోహిత్.. జో రూట్ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఫోక్స్‌కు జరిగిన అనుభవమే రోహిత్‌కు ఎదురైంది. దీంతో అప్పీలు చేస్తూనే తనకు ఉన్న అనుమానాన్ని అంపైర్లతో రోహిత్ పంచుకున్నాడు. బంతి నేలకు తాకి ఉండొచ్చని భావించి థర్డ్ అంపైర్ సలహా తీసుకోమని ఫీల్డ్ అంపైర్లకు సూచించాడు. ఈ విషయాన్ని పోలుస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకోని ఆడాలని ఇంగ్లండ్‌ను నెటిజన్లు విమర్శిస్తున్నారు.