రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్‌పై పట్టుబిగించాలని ఇరు జట్ల ఆటగాళ్లు గొప్పగా పోరాడుతున్నారు. 112 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయినా జో రూట్ (122*) సెంచరీతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు చేసింది. అనంతరం 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు 307 పరుగులు సాధించింది. ధ్రువ్ జురెల్ (90) గొప్పపోరాటం సాధించాడు.
219/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా సాధికారికంగానే ఆడింది. కుల్‌దీప్ యాదవ్ (28; 131 బంతుల్లో)తో కలిసి ధ్రువ్ జురెల్ ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కుల్‌దీప్ ఔటైన అనంతరం అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9; 29 బంతుల్లో)తో కలిసి ధ్రువ్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఆకాశ్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు.

ఆకాశ్ దీప్ వెనుదిరిగిన తర్వాత కూడా బౌండరీలతో హోరెత్తించాడు. ఫోర్లు, సిక్సర్లతో సెంచరీకి చేరువయ్యాడు. కానీ హర్ట్‌లీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లు, టామ్ హర్ట్‌లీ మూడు, అండర్సన్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు అశ్విన్ గట్టిషాక్ ఇచ్చాడు. తెలివైన బంతులతో వరుసగా రెండు వికెట్లు సాధించాడు. డిఫెన్స్ ఆడతాడని ముందే గ్రహించి డకెట్ (15; 15 బంతుల్లో)కు లెగ్ స్టంప్ వైపు అశ్విన్ బౌలింగ్ చేశాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్న డకెట్ డిఫెన్స్ ఆడి.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ చేతికి చిక్కాడు. తర్వాత బంతికే ఒలీ పోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ అయిదు ఓవర్లలోనే 19 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.
కాపేపటికే గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్ (11; 34 బంతుల్లో) కూడా అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 18 ఓవర్లకు ఇంగ్లండ్ 71 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలే (40), జానీ బెయిర్‌స్టో (1) ఉన్నారు.