
ఆదిలోనే షాక్:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆపై భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో.. ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. డొమినిక్ సిబ్లీ నిదానంగా ఆడగా.. జాక్ క్రాలే కాస్త బ్యాట్ జులిపించాడు. అయితే మొహ్మద్ సిరాజ్ వేసిన 21 ఓవర్ చివరి బంతికి క్రాలే (27) క్యాచ్ ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అతడు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆదుకున్న రూట్:
జాక్ క్రాలే అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ మంచి టచ్‌లో కనిపించాడు. మొహ్మద్ సిరాజ్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఈ హ్యాట్రిక్ ఫోర్లతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం డొమినిక్ సిబ్లీ, రూట్ నిలకడగా ఆడారు. దీంతో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ అనంతరం సిబ్లీ ఔట్ అయినా.. జానీ బెయిర్‌స్టో అండతో రూట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. బెయిర్‌స్టో తన మార్క్ షాట్లకు పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కెప్టెన్‌కు అండగా నిలబడ్డాడు.

సామ్ కరన్ పోరాడకుంటే:
జో రూట్ చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు పంపిస్తూ.. హాఫ్ సెంచరీ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి.. రూట్ అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. ఆపై మొహ్మద్ షమీ వేసిన 51వ ఓవర్లో రెండో బంతికి జానీ బెయిర్‌స్టో (29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇదే సమయంలో అంపైర్లు టీ విరామం ప్రకటించారు. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 50.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 రన్స్ చేసింది. అప్పటికి ఇంగ్లండ్ పటిష్ట స్థితిలోనే ఉంది. చివరి సెషన్‌లో బుమ్రా, షమీతో పాటు శార్దూల్ కూడా చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు కోలుకోలేకపోయింది. టీ విరామం అనంతరం ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో సామ్ కరన్ కాసేపు బ్యాట్ ఝళిపించాడు. లేదంటే ఇంగ్లండ్ 150 పరుగులు కూడా చేసేది కాదు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications












