
నాటింగ్‌హామ్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 8 పరుగుల ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్ (77) శతకం వైపు పయనిస్తుండగా.. రవీంద్ర జడేజా (27) దూకుడుగా ఆడుతున్నాడు. వీరిద్దరూ ఇప్పటికే 46 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. రాహుల్, జడేజా రెండో సెషన్లో కూడా ఇలాగే మంచి భాగస్వామ్యం నెలకొల్పితే.. కోహ్లీసేన మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశముంది. తొలుత ఇంగ్లండ్ 183 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే వర్షం కురవడంతో గంట పాటు మ్యాచ్ ఆలస్యమైంది. వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ (25)తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడాడు. అయితే పంత్ మాత్రం దూకుడుగా ఆడాడు. ఓ సిక్స్, మూడు ఫోర్లు బాదాడు. ధాటిగా ఆడే క్రమంలో ఓలి రాబిన్‌సన్ బౌలింగ్‌లో పంత్ ఔట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 145/5గా నమోదైంది. దాంతో టీమిండియా మ్యాచ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కష్టమనే భావన అందరిలోనూ కలిగింది.
రిషబ్ పంత్ అనంతరం స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (27; 53 బంతుల్లో 4x4) క్రీజులోకి వచ్చి చక్కగా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ (77; 202 బంతుల్లో 11x4)కు అండగా నిలబడ్డాడు. అంతేకాదు బౌండరీలు బాదుతూ ఇంగ్లీష్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి భోజన విరామ సమయానికి 46 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో రోజు వీరిద్దరూ మరింత బాగా ఆడితే మ్యాచ్‌పై కోహ్లీసేన పట్టు సాధించినట్టే. మరో ఆల్‌రౌండర్ శార్దూల్ ఉండడం కూడా కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం.
అంతకుముందు రెండో రోజు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ 125/4తో నిలిచిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా రెండో రోజు మూడో సెషన్ ఆట సాహలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ (36) ఫర్వాలేదనిపించగా.. చేతేశ్వర్ పుజారా (4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (5) విఫలమయ్యారు. పుజారా, కోహ్లీ ఒకే ఓవర్లో ఔట్ అవ్వగా.. రహానే మరికాసేపటికే రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్‌తో సమన్వయ లోపం కారణంగా జింక్స్ ఔట్ అయ్యాడు.