For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG:రెండో ఇన్నింగ్స్‌లో నిలబడ్డ రోహిత్, పుజారా, కోహ్లీ..మూడో రోజు భారత్‌ స్కోర్ 215/2!ఇంకా 139 రన్స్!

Virat Kohli take India to stumps, deficit 139 runs

లీడ్స్‌: ఐదు మ్యాచుల టెస్ట్ సిరీసులో భాగంగా హెడింగ్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట పూర్తయింది. మూడో రోజైన శుక్రవారం ఆట నిలిచిపోయేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (45; 94 బంతుల్లో 6x4), టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్‌ పుజారా (91; 180 బంతుల్లో 15x4) క్రీజులో ఉన్నారు. కోహ్లీ, పుజారా మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించి జోడించడంతో భారత్ కోలుకుంది. అంతకుముందు ఓపెనర్‌ రోహిత్ శర్మ (59; 156 బంతుల్లో 7x4, 1x 6) అర్ధ శతకంతో మెరిశాడు. అయితే కేఎల్‌ రాహుల్‌ (8) ఒక్కడే ఈ ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచాడు. ప్రస్తుతం భారత్‌ 139 పరుగుల వెనుకంజలో నిలిచింది.

9 పరుగులు జోడించి:
ఓవర్‌నైట్‌ స్కోరు 423/8తో మూడో రోజు అయిన శుక్రవారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్ తక్కువ పరుగులకే (9 పరుగులు జోడించి) ఆలౌట్ అయింది. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. క్రెయిగ్ ఓవర్టన్‌ (32; 42 బంతుల్లో 6×4) మొహ్మద్ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ప్లేయర్ ఓలి రాబిన్సన్‌ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. జేమ్స్ అండర్సన్‌ (0) అజేయంగా నిలిచాడు. జో రూట్ (121; 165 బంతుల్లో 14x4) సెంచరీ చేయగా.. డేవిడ్ మలన్ (70) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52; 125 బంతుల్లో 5x4, 1x 6), హసీబ్ హమీద్ (60; 130 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో ఇంగ్లండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యం దక్కింది.

నిరాశపరిచిన రాహుల్‌:
ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే 19 ఓవర్ల పాటు ఎంతో ఓపికగా ఆడిన రాహుల్‌ చివరికి క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లో స్లిప్‌లో జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రాహుల్ 54 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ ఔట్ అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (25) క్రీజులో ఉన్నాడు. అప్పటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 320 పరుగులు వెనకబడి ఉంది.

హాఫ్ సెంచరీ బాదిన రోహిత్:
రెండో సెషన్‌లో రోహిత్ శర్మకు జతగా.. చేతేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడినా.. పుజారా ఈ సిరీసులోనే వేగంగా ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచాడు. మరోవైపు రోహిత్ కూడా వేగం పుంజుకున్నాడు. రోహిత్ బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. మరోవైపు పుజారా కూడా తన మార్క్ షాట్లు ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దాంతో భారత్ రెండో సెసన్‌ పూర్తయ్యేసరికి 112/1తో నిలిచింది. రోహిత్, పుజారా రెండో సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా పడకుండా జాగ్రత్తగా ఆడి 78 పరుగులు జోడించారు. రెండో సెషన్ పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ కన్నా భారత్‌ 242 పరుగుల వెనుకంజలో ఉంది.

పుజారా హాఫ్ సెంచరీ:
మూడో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (59) ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం చేతేశ్వర్ పుజారాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిశాడు. కోహ్లీ క్రీజులోకి రాగానే మంచి టచ్‌లో కనిపించాడు. పుజారా ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ బాదాడు. ఆపై కూడా పుజారా చక్కగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు కోహ్లీ కూడా ఇంగ్లీష్ బౌలర్లపై ఒత్తిడి తెస్తూ పరుగులు సాదించాడు. ఈ ఇద్దరూ చివరి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అలా ఆట నిలిచిపోయేసరికి 99 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించి భారత్‌ను నిలబెట్టారు. ప్రస్తుతం భారత్‌ 139 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత్‌ ఈ రోజు మొత్తంలో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ ఇలాగే ఆడితే మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

Story first published: Saturday, August 28, 2021, 0:02 [IST]
Other articles published on Aug 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+