'భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై వికెట్ కీపింగ్ చేయడం అంత సులువు కాదు. అందుకే కేఎల్ రాహుల్‌ను బ్యాటర్‌గానే ఎంపిక చేశాం. స్పెషలిస్ట్ వికెట్ కీపర్లుగా కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్‌ను తీసుకున్నాం' అని ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభానికి ముందుకు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ కట్ చేస్తే.. తొలి టెస్టులో భరత్ ప్రత్యర్థిని ఔట్ చేసే మూడు అవకాశాలు మిస్ చేశాడు. బ్యాటర్‌గానూ పూర్తిగా తేలిపోయాడు. తాజాగా వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ పోప్‌ను తొలి బంతికే ఔట్ చేసే ఓ సువర్ణావకాశాన్ని భరత్ నేలపాలు చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది. యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. గిల్ (34) సెకండ్ టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. 8.3 ఓవర్లకే 50 పరుగులు, 19.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను అందుకుంది.

అయితే కుల్‌దీప్ అద్భుతమైన బంతికి ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్‌దీప్ బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ (21; 17 బంతుల్లో) రజత్ పటిదార్ చేతికి చిక్కాడు. అయితే ఆ తర్వాత గత టెస్టు హీరో ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. కుల్‌దీప్ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడు బ్యాటుకు దొరకలేదు. ఈ క్రమంలో అతడు క్రీజు నుంచి బయటకు వచ్చాడు. కానీ పోప్‌ను స్టంపౌట్ చేసే సువర్ణావకాశాన్ని కేఎస్ భరత్ చేజార్చాడు. పోప్ ఔటైతే ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో పడేది.
దీంతో భరత్‌పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ సరిగా చేయట్లేదు, వికెట్ కీపింగ్ కూడా చేతకాదా అని నెటిజన్లు మండిపడుతున్నారు.ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భరత్ 41, 28 పరుగులు చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న వైజాగ్ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో భరత్ 23 బంతుల్లో 17 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో ఒలీ పోప్ (21), జో రూట్ (5) ఉన్నారు.