టీమిండియా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా మరో సెంచరీతో సత్తాచాటాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 110 పరుగులు సాధించాడు. 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును శతకంతో ఆదుకున్నాడు.
పుజారా పోరాటంతో సౌరాష్ట్ర తొలి రోజు ఆటలో రాజస్థాన్‌పై పైచేయి సాధించింది. శుక్రవారం ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఇవాళ ఆటలో ఆఖరి బంతికి పుజారా ఔటయ్యాడు. కూక్నా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. షెల్డన్ జాక్సన్ (78*) క్రీజులో ఉన్నాడు.

కాగా, సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత రాకపోవడం, ఎన్సీఏలో కోలుకుంటున్న రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ నివేదిక ఇంకా వెలువడకపోవడంతో సెలక్టర్లు భారత జట్టును ఖరారు చేయలేదు.
మరోవైపు శ్రేయస్ అయ్యర్‌కు వెన్నునొప్పి తిరగబెట్టడంతో అతడు చివరి మూడు టెస్టులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫామ్‌లో ఉన్న పుజారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌లు బలంగా ఉన్నాయి. అయితే స్వదేశంలో యువ ఆటగాళ్లు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో సెలక్టర్లు ఉంటే పుజారాకు నిరాశ తప్పదు.
కాగా, రంజీ ట్రోఫీలో పుజారా జార్ఖండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. 243 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హర్యానా జట్టుపై 49, 43 పరుగులు, విదర్భపై 43, 66 పరుగులు చేశాడు. ఇటీవల సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఇవాళ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. ఇక టీమిండియాకు దూరమై పుజారా దాదాపు ఎనిమిది నెలలు దాటింది. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చివరిగా ఆడాడు.