'క్రికెట్ గాడ్'గా సచిన్ టెండూల్కర్, 'కింగ్'గా కోహ్లి.. భారత్ క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. వాళ్ల వారసుడిగా 'ప్రిన్స్' అంటూ శుభ్‌మన్ గిల్ కొద్దికాలంలోనే ఎంతో కీర్తి సంపాదించుకున్నాడు. పరుగులు వరద పారిస్తూ అసాధారణమైన రికార్డులు సాధించాడు. 2023 ఏడాదిలో వన్డేల్లో అతడు సాధించిన పరుగులు అమోఘం. గొప్పగా ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మూడు ఫార్మాట్లలో సత్తాచాటుతూ పరిపూర్ణ బ్యాటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు.
కానీ కట్ చేస్తే.. వన్డే వరల్డ్ కప్ అనంతరం దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. వన్డేలు మినహా మిగిలిన ఫార్మాట్లలో గిల్ తేలిపోతున్నాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో సహా క్రికెట్ విశ్లేషకులు అందరూ విమర్శించారు. వైజాగ్ టెస్టులోనూ వ్యాఖ్యాత రవిశాస్త్రి గిల్‌ను హెచ్చరించాడు. పుజారా టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నాడు. మరోవైపు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ గిల్ పరిస్థితి దారుణంగా మారింది.

ఇవాళ ఇన్నింగ్స్ మినహాయిస్తే అతడి అత్యధిక స్కోరు 36 పరుగులే. సగటు కేవలం 18 మాత్రమే. దీంతో జట్టులో తన స్థానాన్ని కాపాడుకునే పరిస్థితికి ప్రిన్స్ చేరుకున్నాడు. వైజాగ్ టెస్టు అతడికి అగ్ని పరీక్షగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధికారికంగానే ఆడాడు. కానీ అండర్సన్ బోల్తాకొట్టించడంతో 34 పరుగులకే ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో గిల్ క్రీజులోకి వచ్చినప్పుడు జట్టు కష్టాల్లో నిలిచింది. 28/0తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా కాసేపటికీ 30/2తో కష్టాల్లో పడింది.
జట్టు కష్టాలతో పాటు వ్యక్తిగతంగానూ ఒత్తిడిలో ఉన్న గిల్ అద్భుతంగా ఆడాడు. తన సత్తాను నమ్మకుని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. సహచరులు శ్రేయస్ అయ్యర్, రజత్ పటిదార్ వెనుదిరిగానే స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 134 బంతుల్లో సెంచరీని సాధించాడు. అయితే శతకాన్ని అందుకున్న తర్వాత గిల్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. సింహం గర్జించినట్లుగా బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకుంటాడు. కానీ ఈ సెంచరీ తర్వాత అలాంటి గర్జనలు ఏమీ కనబడలేదు.
కనీసం గిల్ ముఖంపై చిరునవ్వు కూడా లేదు. భావోద్వేగంతో కన్నీటిని ఆపుకుంటూ ఆకాశం వైపు తల ఎత్తాడు. అనంతరం పార్టనర్ అక్షర్ పటేల్‌ను హత్తుకుని సాధారణంగా సెలబ్రేషన్స్ ముగించాడు. ఈ ఇన్నింగ్స్ గిల్‌కు ఎంత ప్రత్యేకమో అతడి సెలబ్రేషన్స్ చూస్తే తెలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తనపై ఉన్న భారాన్ని మొత్తంగా తొలగించుకున్నాడని, గిల్ పూర్తిగా మారిపోయాడని అంటున్నారు. కాగా, గిల్ 147 బంతుల్లో 104 పరుగులు సాధించి ఔటయ్యాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.