India vs England 5th test: అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్.. తన చివరిదైన అయిదో మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతోంది. నేడు లండన్ కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో ఓడిపోతే సిరీస్ ను ఇంగ్లాండ్ కు ధారదాత్తం చేసినట్టవుతుంది టీమిండియాకు.
ఇప్పటివరకు జరిగిన నాలుగింట్లో ఇంగ్లాండ్ రెండింట్లో విజయం సాధించింది. 2-1 తేడాతో ఆధిక్యతను సాధించింది. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్ ను సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్, సమం చేయడానికి టీమిండియా శాయశక్తులా ప్రయత్నిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాయి.

ఈ పరిస్థితుల మధ్య టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. సిరీస్ సమం కావాలంటే గెలిచి తీరాల్సిన అయిదో టెస్ట్ మ్యాచ్ కు స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ సలహా మేరకు అతనికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. బుమ్రా స్థానంలో పేసర్ ఆకాష్ దీప్ జట్టులోకి రానున్నాడు.
ఈ మార్పు ఈ ఒక్క ప్లేయర్ వద్దే ఆగేలా కనిపించట్లేదు. తుదిజట్టులో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. బుమ్రాను కూడా కలుపుకొంటే మొత్తం నలుగురు ప్లేయర్లకు తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. ఈ జాబితాలో రిషభ్ పంత్ కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేని ప్లేయర్లకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది జట్టు మేనేజ్మెంట్. ఈ క్రమంలో శార్దుల్ ఠాకూర్ పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఓ పేస్ బౌలర్ కు బదులుగా స్పెషలిస్ట్ బ్యాటర్ ను తీసుకోవచ్చు. ఆ అవకాశం కరుణ్ నాయర్ కు లభించవచ్చు.
అలాగే- యంగ్ ప్లేయర్ అన్షుల్ కాంబోజ్ కూడా బెంచ్ కే పరిమితం కావొచ్చు. అతని స్థానంలో ప్రసిద్ధ కృష్ణకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. తొలి టెస్ట్ ఆడిన కాంబోజ్.. ఇంగ్లాండ్ బ్యాటర్లను పెద్దగా భయపెట్టలేకపోయాడు. మాంచెస్టర్ టెస్ట్ లో అతను పడగొట్టింది ఒక్క వికెట్టే.
గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు బదులుగా ధృవ్ జురెల్ కు ఇప్పటికే చోటు ఖాయమైన విషయం తెలిసిందే. కాలి గాయంతో పంత్ బాధపడుతున్నాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అతను గాయపడ్డ విషయం తెలిసిందే. కాలికి కట్టు కట్టుకుని నడుస్తున్నాడతను. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా జురెల్ కు ఉండటం ప్లస్ పాయింట్.