
మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు జూనియర్ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్ పర్మార్ కరోనా మహమ్మారి బారిన పడటంతో.. టీమిండియా ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారని వెటరన్ వికెట్ కీపర్, వ్యాఖ్యాత దినేశ్ కార్తిక్ తెలిపాడు. ఐదో టెస్టు నిర్వహణపై సందిగ్ధం నెలకొనడంతో.. చాలా మంది భారత ఆటగాళ్లు తెలవారుజామున 3 గంటల వరకూ నిద్రపోలేదని చెప్పాడు. ఈరోజు మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రద్దు చేసిన విషయం తెలిసిందే. భారత బృందంలో కరోనా కేసులు పెరగడమే అందుకు కారణం. వరుసగా కోచ్‌లు వైరస్ బారిన పడినా.. ప్లేయర్స్ అందరికీ నెగటివ్‌గా తేలడం సంతోషించదగ్గ విషయం.
దినేశ్ కార్తిక్ ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్ 2021 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఉన్నాడు. అయితే కోల్‌కతా జట్టులో చేరడానికి ముందు మొదటి మూడు టెస్టులకు డీకే వ్యాఖ్యానం చేశాడు. తాజాగా కార్తీక్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. 'నేను కొద్ది మంది భారత ఆటగాళ్లతో మాట్లాడాను. నాలుగో టెస్టు తర్వాత చాలా మంది ఆటగాళ్లు అలిసిపోయి ఉన్నారు. దాదాపుగా అందరూ. నాలుగు టెస్టులో వారు బాగా శ్రమించారు. దానికి తోడు కోచ్‌లు కూడా అందుబాటులో లేకపోవడంతో మానసికంగా కొంత బలహీనపడ్డారు' అని తెలిపాడు.
'సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, హెడ్ కోచ్ రవిశాస్త్రి, మరో ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో.. అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌పై ఒత్తిడి పడింది. ప్రస్తుతం అతడికి కూడా కరోనా సోకింది. దీంతో ఆటగాళ్లు మరింత గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఐదో టెస్టు నిర్వహణపై సందిగ్ధం నెలకొనడంతో.. చాలా మంది ఆటగాళ్లు తెలవారుజామున 3 గంటల వరకూ నిద్రపోలేదు. ఈ సిరీస్ కఠినమైన బుడగలో జరగడం లేదని నా అభిప్రాయం. ఏదేమైనా ఆటగాళ్లు యూఏఈకి బయలుదేరే ముందు వారివారి గదుల్లోనే ఉండాలి. టెస్ట్ మ్యాచ్ సమయం ఐదు రోజులు గదులకే పరిమితమై.. ఆ తర్వాత ఐపీఎల్ 2021 బుడగలోకి ప్రవేశిస్తే బాగుంటుంది' అని దినేశ్ కార్తిక్ సూచించాడు.
'మనం కూడా ఓ విషయం అర్థం చేసుకోవాలి. టెస్ట్ సిరీస్ అనంతరం ఐపీఎల్ 2021, ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ కూడా షెడ్యూల్ అయి ఉంది. వారం కూడా గ్యాప్ ఉండదు. ఆటగాళ్లు తీరికలేని క్రికెట్ ఆడనున్నారు. ఎక్కడైనా బయో బబుల్ తప్పనిసరి. ఇది కాస్త కష్టమే' అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులు యూఏఈ వేదికగా ఈ నెల 19న ఆరంభం కానున్నాయి. ఇందుకోసం యూఏఈ చేరుకున్న డీకే.. త్వరలో ప్రాక్టీస్ ఆరంబించనున్నాడు.
దినేశ్ కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో డీకే చివరిసారి భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీ ఫైనల్లో విఫలమైన డీకే.. కేవలం 6 పరుగులే చేశాడు. దాంతో అప్పటి నుంచి డీకేను భారత్ తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం అతడు ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. భారత సెలెక్టర్లు డీకే పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఇక ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు.