

లండన్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో కొనసాగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌పై భారత జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్‌లో కాస్త తడబడినప్పటికీ.. ఆ తరువాత నిలదొక్కుకుంది. రెండో ఇన్నింగ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి చేతేశ్వర్ పుజారా-50, తొలి ఇన్నింగ్ సెంచరీ హీరో, వికెట్ కీపర్ రిషభ్ పంత్-30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యతలో ఉంది భారత్. ఇవ్వాళ ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసే అవకాశాలు లేకపోలేదు. చివరి గంటలో ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసి, బౌలింగ్ విజృంభించాలనేది టీమిండియా గేమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. చివరి గంటలో వీలైనన్ని వికెట్లను పడగొట్టడం ద్వారా ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనేది టీమిండియా వ్యూహం. టెస్ట్ మ్యాచ్ అయిదో రోజులో ప్రవేశించే సమయానికి ఇంగ్లాండ్ జట్టు.. ఒత్తిడిలో ఉండేలా ప్లాన్ రూపొందించుకుంది.
మూడో రోజు మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ-జానీ బెయిర్‌స్టో మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం.. హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ మొత్తానికీ హైలైట్‌గా నిలిచింది. ఇద్దరూ ఫేస్ టు ఫేస్ వాదించుకున్నారు. బెయిర్‌స్టో దృష్టి బంతి మీద తప్ప స్టేడియం మొత్తం మీద ఉంటుందంటూ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ చేయడం ఈ గొడవకు దారి తీసింది. కోహ్లీ తనదైన శైలిలో స్లెడ్జింగ్‌కు దిగడం వాతావరణాన్ని వేడెక్కించినట్టయింది. అదే వేడిలో బెయిర్ స్టో సెంచరీ బాదాడు.
ఈ గొడవపై బెయిర్‌స్టో స్పందించాడు. కోహ్లీతో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు. పైగా కోహ్లీపై ప్రత్యర్థిగా బరిలో దిగడాన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. తామిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటామని పేర్కొన్నాడు. క్రికెట్ మీద కోహ్లీకి అపారమైన ప్రేమ, భక్తి ఉందని, ఆ దూకుడుతోనే అతను గేమ్ ఆడుతుంటాడని బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు. క్రికెట్ పట్ల అతనికి ఉన్న భక్తి.. మరింత మెరుగుపరుస్తోందని వ్యాఖ్యానించాడు. డిన్నర్‌కు పిలవకపోవడమే విరాట్ కోహ్లీ ఆగ్రహానికి కారణమైందని నవ్వుతూ బదులిచ్చాడు.
ఏ జట్టయినా తన దేశం కోసమే ఆడుతుందని, మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా దేశానికి పేరు తీసుకుని రావాలనే భావిస్తుందని బెయిర్‌స్టో చెప్పాడు. తమ ఇద్దరి విషయంలోనూ అదే జరిగిందని వివరించాడు. భారత జట్టును ఎదుర్కొనడం ఎప్పటికీ కష్టసాధ్యమేనని అన్నాడు. సిరీస్ సిరీస్‌కూ టీమిండియా ప్లేయర్లు రాటుదేలుతున్నారని కితాబిచ్చాడు. దీనికి కోహ్లీ కూడా మినహాయింపు కాదని పేర్కొన్నాడు. తామిద్దరం ప్రత్యర్థులుగా ఎదురుపడటాన్ని ఆస్వాదిస్తానని అన్నాడు.