ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20లో సంజూ శాంసన్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఐపీఎల్ 2025 సీజన్ లో పాల్గొంటాడా లేదా అనే అనుమానం క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతోంది. ఇంతకీ అతడి గాయం తీవ్రత ఎలా ఉందో తెలుసుకుందాం.
రీసెంట్ గా దక్షిణాఫ్రికాపై రెండు శతకాలతో అదిరే ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్.. తాజాగా స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో నిరాశపరిచాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 26 పరుగులతో ఫర్వాలేదనిపించిన అతడు.. ఆ తర్వాత వరుసగా 5, 3, 1, 16 రన్స్ చేసి విఫలమయ్యాడు. ఐదో టీ20లో అతడు ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. జోరును కొనసాగించలేకపోయాడు. ఈ క్రమంలో అతడి వేలికి గాయమైంది. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఈ దెబ్బ తాకింది. మైదానంలోకి ఫిజియో వచ్చి కాసేపు పరిశీలించి సంజూను బయటకు తీసుకెళ్లాడు. దీంతో సంజూ స్థానంలో ధ్రువ్ జురెల్ ను ఆడించారు.

సంజూ మైదానాన్ని వీడడంతో అతడి గాయం తీవ్రత ఎలా ఉందో అని క్రికెట్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. అయితే అతడి గాయం అంత పెద్దది కాదని తెలిసింది. ముందు జాగ్రత్తగా గాయం తీవ్రత పెరగకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారని సమాచారం అందింది. త్వరలోనే జరగబోయే ఐపీఎల్ ను దృష్టిలో పెట్టుకుని.. అతడి గాయాన్ని ఇండియన్ మెడికల్ టీమ్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ దగ్గరగా పరిశీలిస్తోందట. ఐపీఎల్ కు మరింత సమయం ఉంది కాబట్టి అతడు త్వరగానే కోలుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా సంజూ శాంసన్ గాయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండాల్సిందే.
అరుదైన ఘనత
ఇంకా తాజాగా జరిగిన ఐదో టీ20లో సంజూ ఓ ఘనత కూడా సాధించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఎలైట్ క్లబ్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఈ మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ ను సిక్సర్‌తో ప్రారంభించిన సంజూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున ఓ మ్యాచ్‌లో మొదటి బంతికే సిక్స్ బాదిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ ను టచ్ చేశారు.