అభిషేక్ శర్మ.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఈ పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం.. ఈ యంగ్ బ్యాటర్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో సంచలన ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించడమే. 37 బంతుల్లోనే శతకం బాదిన ఈ యంగ్ ప్లేయర్ ఏకంగా 13 సిక్సర్లు బాది సిక్సర్ల కింగ్ అనిపించుకున్నాడు. అయితే ఈ విజయం వెనక తన మెంటార్, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడని ఇప్పటికే చెప్పాడు అభిషేక్ శర్మ. తాజాగా ఇప్పడదే విషయాన్ని అభిషేక్ తండ్రి రాజ్ కుమార్ శర్మ కూడా చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు దేశం కోసం భీకర ఇన్నింగ్స్ ఆడుతుంటే.. తాను ఎంత గర్వంగా ఫీలయ్యారో వివరించారు.
నా మనసు ఉప్పొంగిపోయింది
"నేను స్టేడియానికి హాజరు కాలేదు. కానీ నా భార్య, కూతురు.. అభిషేక్ వరల్డ్ క్లాస్ ఇన్నింగ్స్ కళ్లారా చూశారు. నేను టీవీకి అతుక్కుపోయి చూశాను. ఎంతో గర్వంగా అనిపించింది. మా చుట్టూ ఉన్నవాళ్లంగా మాకు అభినందనలు తెలిపారు. దేశం కోసం నా కొడుకు అద్భుతమైన ప్రదర్శన చేసేది చూస్తుంటే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది." అని రాజ్ కుమార్ శర్మ అన్నారు.

నా కొడుకు విజయంలో అతడిది కీలక పాత్ర
అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్ సింగ్ ది కీలక పాత్ర అని కొనియాడాడు రాజ్ కుమార్ శర్మ. "నా కొడుకు కోసం యువరాజ్ సింగ్ తన విలువైన సమయాన్ని ఎక్కువ సేపు కేటాయించాడు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో అభిషేక్.. యూవీతో కలిసి 3-4 నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. యువరాజ్ లేనప్పుడు కూడా అతడి తండ్రి యోగ్ రాజ్ సింగ్.. అభిషేక్ కు మార్గదర్శకుడిగా ఉండేవారు. యువరాజ్ ఓ దేవుడిలా వచ్చాడు. అభిషేక్ ఏదీ సాధించినా అది యూవీ క్రెడిటే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎలా ఆడాలనే విషయమై.. యువీ ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలే అభిషేక్ ను ఇన్ని ఘనతలు సాధించేలా చేశాయి." అని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.