India vs England: మూడో టెస్టుతో హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ! అరరే.. ఎన్నిరోజులాయే!!

హైదరాబాద్: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లీడ్స్ వేదికగా బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (0), చతేశ్వర్ పుజారా (1), విరాట్ కోహ్లీ (7) వరుసగా పెవిలియన్ చేరారు. ఈ ముగ్గురినీ ఇంగ్లండ్ సీనియర్ పేసర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ ఒకే తరహాలో బోల్తా కొట్టించడం గమనార్హం. ముఖ్యంగా కోహ్లీ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడిన కోహ్లీ.. కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మరోసారి అండర్సన్‌కే:
జేమ్స్ అండర్సన్‌కి ఈ తరహాలో విరాట్ కోహ్లీ దొరికిపోవడం ఇదేమి తొలిసారి కాదు. 2014లో ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లిన కోహ్లీ.. ఐదు టెస్టులాడి ఏకంగా నాలుగు సార్లు జిమ్మీకి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ చేసిన పరుగులు కేవలం 134 మాత్రమే. అయితే 2018లో ఆ తప్పిదాల్ని దిద్దుకున్న కోహ్లీ.. ఐదు టెస్టుల్లో 593 పరుగులతో దూసుకుపోయాడు. ఒక్కసారి కూడా అండర్సన్‌కి వికెట్ ఇవ్వలేదు. కానీ తాజా పర్యటనలో కోహ్లీ కథ మళ్లీ మొదటికే వచ్చింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అండర్సన్‌కి వికెట్ సమర్పించుకున్న కోహ్లీ.. మూడో టెస్టులోనూ మరోసారి అతడికే దొరికిపోయాడు.
అభిమానులు ఆశగా ఎదురుచూసినా:
విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై (డే/నైట్ టెస్ట్) చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70+ పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ రాణించలేదు. ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. అది కుదరడం లేదు. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లో కూడా అదే దిశగా సాగుతున్నాడు.

కోహ్లీ హాఫ్ సెంచరీ:
ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేయక ఇప్పటికి 50 ఇన్నింగ్స్‌లు అయ్యాయి. లీడ్స్ వేదికగా ఈరోజు ఆరంభం అయిన తొలి ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ శతకం అందుకోక 50 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యాయి. మూడు ఫార్మాట్‌లలో కలిపి 50 ఇన్నింగ్స్‌లు అయ్యాయి. 18 టెస్ట్ ఇన్నింగ్స్‌లు, 15 వన్డే ఇన్నింగ్స్‌లు, 17 టీ20 ఇన్నింగ్స్‌లు అందులో ఉన్నాయి. దీంతో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 'మూడో టెస్టుతో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అరరే.. ఎన్నిరోజులాయే. హాఫ్ సెంచరీ చేయక' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'కోహ్లీ 71 సెంచరీ చేయడం అభిమానులకు ఓ కలగా మిగిలిపోనుంది', 'కోహ్లీ ఇక రిటైర్మెంట్ ఇచ్చే సమయం వచ్చేసింది' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జిమ్మీ 7 సార్లు:
విరాట్ కోహ్లీని టెస్టుల్లో ఎక్కువసార్లు ఔట్ చేసిన బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ నిలిచాడు. కోహ్లీని టెస్టుల్లో జిమ్మీ 7 సార్లు పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా కోహ్లీని 7 సార్లు ఔట్ చేశాడు. స్టువర్ట్ బ్రాడ్, మోయిన్ అలీ, పాట్ కమిన్స్, బెన్ స్టోక్స్.. కోహ్లీని ఐదు సార్లు ఔట్ చేశారు. 2016 నుంచి 18 మధ్య కాలంలో 18 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. అండర్సన్‌కు ఒక్కసారి కూడా వికెట్ ఇవ్వలేదు. 2021లో మాత్రం 4 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ రెండు సార్లు అండర్సన్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఇక లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన.. మొదటి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(15) క్రీజులో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications