
ఓవల్: ఐదవ రోజు రెండో సెషన్‌లో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. దాంతో నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమి దాదాపుగా ఖరారైంది. 193 పరుగుల వద్ద ఆ జట్టు కీలకమైన క్రిస్ వోక్స్ (18) వికెట్‌ను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో వోక్స్ ఎనిమిదవ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా చారిత్రక గెలుపుకు మరో రెండు వికెట్ల దూరంలో నిలిచింది. క్రీజ్‌లో క్రెయిగ్ ఓవర్టన్ (5) ఉన్నాడు. వోక్స్ వికెట్ అనంతరం అంపైర్లు టీ విరామం ప్రకటించారు. భారత్ విజయానికి ఇంకా రెండు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టు గెలవాలంటే ఇంకా 175 రన్స్ చేయాలి. బుమ్రా, జడేజా, ఠాకూర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఓవర్ నైట్ స్కోర్ 77/0తో ఐదవ రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. సరిగ్గా 100 పరుగుల వద్ద రోరీ బర్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగులో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బర్న్స్.. ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ హసీద్ హమీద్ 55 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 48వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన హమీద్.. మొహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ దాన్ని నేలపాలు చేయడంతో అద్భుత అవకాశం చేజారింది.
ఇక క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న హిట్టర్ డేవిడ్ మలన్ (5) త్వరగానే రన్ ఔటయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 53వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తూ మలన్ రన్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ నిలకడగా ఆడాడు. దాంతో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. లంచ్ తర్వాత మూడో ఓవర్‌లోనే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న హమీద్ (63)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 141 పరుగుల వద్ద హమీద్ వికెట్ కోల్పోయిన ఆతిధ్య జట్టు 146 పరుగుల స్కోర్ వద్ద ఓలీ పోప్ (2) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. పోప్‌ను బుమ్రా బోల్డ్ చేశాడు.
146 పరుగుల వద్ద ఓలీ పోప్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. అదే స్కోర్ వద్ద జానీ బెయిర్‌స్టోను సైతం బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఓటమికి పునాది వేశాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 146 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదింది. అయితే రూట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక జట్టు స్కోర్ 147 పరుగుల వద్ద ఉండగా మొయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో సబ్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ఇక ఇంగ్లండ్ ఆఖరి ఆశాకిరణం జో రూట్ (36) ఎట్టకేలకు పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోర్ 182 పరుగుల వద్ద శార్దూల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే కీలకమైన క్రిస్ వోక్స్ (18)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ మ్యాచ్‌పై ఆశలు దాదాపుగా వదిలేసింది. వోక్స్ వికెట్ అనంతరం అంపైర్లు టీ విరామం ప్రకటించారు. భారత్ విజయానికి ఇంకా రెండు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టు గెలవాలంటే ఇంకా 175 రన్స్ చేయాలి.