నాలుగోరోజు టపటపా
నాలుగో రోజు తొలి గంటలోనే వికెట్లను కొల్లగొట్టారు ఇంగ్లాండ్ బౌలర్లు. క్రిస్ వోక్స్ రెండు, మొయిన్ అలీ ఒక వికెట్ తీసుకున్నారు. ఓవర్ నైట్ స్కోర్ 22 పరుగులతో విరాట్ కోహ్లీ, తొమ్మిది పరుగులతో రవీంద్ర జడేజా నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభించారు. ఎక్కువ సేపు నిలవలేకపోయారు. తొలుత రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు.
ఓవర్ నైట్ స్కోరుకు ఎనిమిది పరుగులు మాత్రమే జోడించి.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిల్ వికెట్ మీద పిచ్ అయిన బంతిని ఫ్లిక్ చేయబోయి గురి తప్పాడు. అది కాస్త నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయడం.. అంపైర్ వేలు పైకెత్తడం చకచకా జరిగిపోయాయి. మిడ్ వికెట్ మీద పడిన బంతి స్వింగ్ అయి.. ఆఫ్ స్టంప్ మీదికి దూసుకెళ్తోన్నట్లు రీప్లేలో స్పష్టమైంది. అప్పటికి జట్టు స్కోరు 296 పరుగులు.
రహానె వంతు..
రవీంద్ర జడేజా అవుట్ అయిన తరువాత అజింక్యా రహానె క్రీజ్‌లోకి వచ్చాడు. ఎక్కవ సేపు నిలవలేకపోయాడు. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న తరువాత పెవిలియన్ దారి పట్టాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడబోయి గురి తప్పాడు. అది నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. దీన్ని క్లీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రహానె రూపంలో 296 పరుగుల వద్దే అయిదో వికెట్‌ను కోల్పోయింది భారత్.
కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో..
జట్టు స్కోరు 312 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. క్రీజ్‌లో కుదురుకుని అద్భుతమైన షాట్లను ఆడుతూ కనిపించిన కేప్టెన్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తన తొలి ఓవర్‌లోనే కోహ్లీని పెవిలియన్ దారి పట్టించాడు స్పిన్నర్ మొయిన్ అలీ. 44 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో ఓవర్టన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడతను. ఆఫ్ స్టంప్ లైన్ మీద పడిన బంతిని పుష్ చేయబోయాడు కోహ్లీ. టైమింగ్ మిస్ అయింది. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన బంతిని ఓవర్టన్ అందుకున్నాడు.
స్పిన్ బౌలింగ్‌లో ఫస్ట్ టైమ్
విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్‌లో స్పిన్నర్‌కు వికెట్‌ను పారేసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా తొమ్మిది ఇన్నింగులను ఆడిన కోహ్లీని ఫాస్ట్ బౌలర్లే బలి తీసుకుంటూ వచ్చారు. ఈ సారి మొయిన్ అలీ ఆ డ్యూటీని తీసుకున్నాడు. ఈ సిరస్‌లో పడుతూ లేస్తూ సాగుతోంది. టీమిండియా కేప్టెన్ బ్యాటింగ్. 44, 13, 0, 42, 20, 7, 55, 50, 44 ఇలా సాగుతోంది అతని ఇన్నింగ్. మూడుసార్లు 40 ప్లస్, రెండు సార్లు 50 ప్లస్ స్కోర్ సాధించాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో అసహనం
అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న తరువాత విరాట్ కోహ్లీ తనపై తానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకున్నట్టు కనిపించింది. తీవ్ర అసహనంతో కనిపించాడతను. హెల్మెట్‌ను విసురుగా కిందికి పడేయడం కనిపించింది. భారీ స్కోర్ మీద కన్నేసిన జట్టు ఒకవంక.. అర్ధ సెంచరీకి దగ్గరగా అవుట్ కావడం మరో వంక.. అనవసరమైన షాట్ ఆడిన అసంతృప్తి అతనిలో కనిపించింది. లంచ్ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. మొత్తంగా 230 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రిషబ్ పంత్ 16, శార్దుల్ ఠాగూర్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.


Click it and Unblock the Notifications












