
లండన్: ఇంగ్లాండ్‌తో ఆడుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. లోయెస్ట్ స్కోర్‌ను నమోదు చేసింది. వంద పరుగులకు కూడా దూరం కావడం కలవరపరుస్తోంది. బ్యాటింగ్ బలహీనతలను ఎత్తి చూపింది. రోహిత్ శర్మ, అజింక్య రహానె మినహా మరెవరూ డబుల్ డిజిట్‌ను అందుకోలేకపోయారు. రెండో టెస్ట్‌ను గెలిచిన ఓ జట్టు.. మూడో టెస్ట్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల అటు అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ పరిణామాల పట్ల రిషభ్ పంత్ స్పందించాడు. ఇదంతా గేమ్‌లో భాగమనేనని కామెంట్ చేశాడు. ప్రతి రోజూ వందశాతం ఎఫర్ట్స్ పెట్టి బ్యాట్స్‌మెన్లు ఆడతారని, అది అన్ని సందర్భాల్లో సక్సెస్ కాదని, బ్యాట్స్‌మెన్లను వైఫల్యాలు వెంటాడుతాయని అన్నాడు. మ్యాచ్ తొలి సెషన్‌లో పిచ్ సాఫ్ట్‌గా కనిపించిందని, ఇంగ్లాండ్ బౌలర్లు మంచి ఏరియాల్లో బంతులను సంధించారని కితాబిచ్చాడు. బ్యాట్స్‌మెన్ల లోపాలు ఎక్కడున్నాయో.. వాటిని కనిపెట్టి.. దానికి అనుగుణంగా బౌల్ చేశారని పేర్కొన్నాడు. వాటిని సమర్థవంతంగా ఆడటానికి ప్రయత్నించినప్పటికీ.. అంచనాలు తప్పాయని చెప్పాడు. బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుంటామని, భారీ భాగస్వామ్యాలను నెలకొల్పుతామని అన్నాడు. రెండో ఇన్నింగ్‌లో భారీ స్కోరు సాధిస్తామని పేర్కొన్నాడు. హెడింగ్లే టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో రిషభ్ పంత్ రెండు పరుగులే చేశాడు. రాబిన్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని తప్పు పట్టడం సరికాదని రిషభ్ పంత్ వ్యాఖ్యానించాడు. కేప్టెన్ విరాట్ కోహ్లీ సరైన నిర్ణయమే తీసుకున్నాడని పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేయాలనుకోవడాన్ని తాను తప్పు పట్టట్లేదని అది, సరైన నిర్ణయమేనని తాను భావిస్తున్నానని అన్నాడు. బ్యాట్స్‌మెన్ల లోపాలు, ఇంగ్లాండ్ బౌలర్లు పిచ్ పరిస్థితులు, అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందని చెప్పాడు. ఇదివరకు 36 పరుగులకు ఆలౌట్ అయిన దానితో పోలిస్తే.. కొంత బెటరేనని పంత్ కామెంట్ చేశాడు.
టీమిండియా ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై ఇంగ్లాండ్ అభిమానులు బాటిల్స్, బాల్స్ విసిరేయడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు రిషభ్ పంత్. ఈ టెస్ట్ సిరీస్‌లో తొలిసారిగా తమ జట్టు భారత్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోండటం అటు స్టేడియంలో కూర్చున్న ఇంగ్లాండ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌పై పింక్ కలర్ ప్లాస్టిక్ బాటిల్‌ను విసిరారు. అతనికి తగల్లేదు గానీ.. కాస్త పక్కకు వచ్చి పడిందా బాటిల్. అతన్ని ట్రోల్ చేస్తూ ఏవేవో సైగలు చేశారు.
ఈ చర్యను ఎవరూ సమర్థించబోరని రిషభ్ పంత్ అన్నాడు. క్రికెట్‌కు ఏ మాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించాడు. అలాంటి పనులు క్రికెట్ జట్టుతో పాటు ఆ దేశంపైనా చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని చెప్పాడు. ఇంగ్లాండ్ అభిమానుల చేష్టలు కేప్టెన్ విరాట్ కోహ్లీని తీవ్ర నిరాశకు గురి చేశాయని అన్నాడు. అభిమానులు.. తమ దేశ క్రికెటర్లను ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు గానీ.. ప్రత్యర్థి జట్టు ప్లేయర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించకూడదని అన్నాడు. అది క్రికెట్‌కు మంచిది కాదని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.