
లీడ్స్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హెడింగ్లీ లీడ్స్ వేదికగా మూడో టెస్టు మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే కోహ్లీ కొనసాగించాడు. దీంతో జట్టులో చోటు ఆశించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. లంక పర్యటన నుంచి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. డోమ్ సిబ్లీ స్థానంలో డేవిడ్ మలన్, మార్క్ వుడ్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ జట్టులోకి వచ్చారు.
తాను టాస్ గెలవడం ఆశ్చర్యంగా అనిపించిందని టాస్ సందర్భంగా విరాట్ కోహ్లీ అన్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశాడు. ఆర్ అశ్విన్‌ను తీసుకోవాలని భావించినా.. స్థానిక పరిస్థితుల్లో అదనపు పేసర్ ఉండటం ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేస్తుందని తెలిపాడు. వికెట్‌ను చూస్తుంటే రవీంద్ర జడేజా ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుందని కోహ్లీ వెల్లడించాడు. టెస్ట్ మ్యాచ్‌లో వరుసగా 8 సార్లు ఓడిపోయిన తర్వాత కోహ్లీ ఈ మ్యాచులో టాస్ గెలిచాడు. టాస్ ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. ప్రస్తుతం పిచ్ బాగుందని, ఇక్కడ బ్యాటింగ్ చేయడం సులువేనన్నాడు. సిబ్లీ స్థానంలో మలన్, వుడ్ స్థానంలో ఓవర్టన్ జట్టులోకి వచ్చారని చెప్పాడు. సాకిబ్ మంచి బౌలర్ అని, కానీ ఓవర్టన్ నిరంతరం కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నాడు కాబట్టి మేం అతడివైపే మొగ్గుచూపాం అని పేర్కొన్నాడు. ఓపెనర్లు మాకు మంచి ప్రారంభాన్ని అందిస్తారని ఆశిస్తున్నా అని రూట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా వెనుకబడి.. లార్డ్స్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచిన టీమిండియా.. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. లీడ్స్ టెస్టులో కూడా గెలుపొందాలని కోహ్లీసేన చూస్తోంది. మరోవైపు లార్డ్స్‌లో ఆట కంటే ఎక్కువ తమ వ్యవహార శైలితోనే వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్.. ఆ పరాజయాన్ని పక్కనపెట్టి సిరీస్ సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. దీంతో మూడో టెస్ట్ కూడా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
పిచ్, వాతావరణం పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించే అవకాశాలున్నాయి. పిచ్‌పై పచ్చిక ఎక్కువ లేకున్నా.. గతంలో ఇక్కడ సీమర్లు పండుగ చేసుకున్న విషయం గుర్తుంచుకోవాలి. భారత పేసర్లు మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.. ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, క్రెయిగ్ ఓవర్టన్, జేమ్స్ అండర్సన్ చెలరేగనున్నారు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో వర్ష సూచన లేదు. వాతావరణం మేఘావృతమై ఉండనుంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, క్రెయిగ్ ఓవర్టన్, జేమ్స్ అండర్సన్.