
హెడ్డింగ్లీ: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ తొలి రోజు తొలి సెషన్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి ముందు భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ ఓలి రాబిన్సన్ వేసిన 25.5 ఓవర్‌కు రహానే కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రహానే 54 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. రహానే పెవిలియన్ చేరిన అనంతరం అంపర్లు భోజన విరామం ప్రకటించారు. లంచ్ సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15) పరుగులతో ఉన్నాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కీలక నాలుగు వికెట్లు పడగొట్టి రెండో టెస్ట్ పరాభవానికి బదులు తీర్చుకుంది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెనర్, సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (0; 4 బంతుల్లో) డకౌటయ్యాడు. జేమ్స్ అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదవ బంతికే కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. బంతిని డ్రైవ్ చేయబోగా.. బ్యాటు అంచుకు తగిలి కీపర్ చేతుల్లో పడింది. రాహుల్ అనంతరం క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్ చేతేశ్వర్ పుజారా (1; 9 బంతుల్లో) కూడా నిరాశపరిచాడు. అండర్సన్ వేసిన 4.1వ బంతికి అతడు కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ నాలుగు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చేతేశ్వర్ పుజారా అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. జేమ్స్ అండర్సన్ నిప్పులు చేరగడంతో తన సహజ శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. అనవసర షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకున్నాడు. అయితే అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 10.5 ఓవర్‌కు కోహ్లీ ఔట్ అయ్యాడు. కీపర్ బట్లర్‌కి అతడు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 7 పరుగులకే ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ గతి తప్పింది. విరాట్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానేతో కలిసి రోహిత్ నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు.
అజింక్య రహానే, రోహిత్ శర్మ ఇద్దరూ సమయోచితంగా ఆడారు. రోహిత్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయినా.. రహానే సింగిల్స్ తీస్తూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 18 పరుగులు చేసిన రహానే క్రీజులో కుదురుకున్నట్టుగానే కనిపించాడు. అయితే అంతలోనే ఓలి రాబిన్సన్‌కు చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం లంచ్ బ్రేక్‌కు వెళ్లింది భారత్. ప్రస్తుతం భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15) క్రీజులో ఉన్నాడు. లంచ్ అనంతరం రోహిత్‌కు జతగా రిషబ్ పంత్ రానున్నాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కీలక నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టింది.