
పట్టు వదలని విక్రమార్కుడిలా రిషబ్ పంత్ కడవరకు క్రీజులో నిలబడి ఇండియాకు అపురూప విజయాన్ని అందించాడు. 80లోపే టాపార్డర్ బ్యాటర్లు ఔటయి డగౌట్లో కూర్చుండగా.. మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి అద్వితీయ రీతిలో ఛేజింగ్‌ను సాగించాడు. అతని బ్యాటింగ్లో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం.. అతని షాట్ సెలెక్షన్లో కన్పించిన పర్ ఫెక్షన్.. అతని ఆట విధానంలో కన్పించిన డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడా ఇంగ్లాండ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా గెలుపు అంచుల వరకు తాను నిల్చుండాలనే నిబ్బరం అమోఘమనే చెప్పాలి. ఏదేమైనా ఇంగ్లాండ్ గడ్డ మీద భీకరమైన ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టును 2-1తేడాతో ఓడించి ఇండియా సిరీస్ కైవసం చేసుకోవడం అరుదైన ఘనత అనే చెప్పుకోవాలి. ఇక రిషబ్ పంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా నిలవగా.. హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీలక భాగస్వామ్యం
ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్‌లో జరిగిన డిసైడర్ మ్యాచ్ అయిన మూడో వన్డే రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 45.5ఓవర్లలో ఇంగ్లాండ్ 259పరుగులకు ఆలౌటైంది. ఇక 260పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 42.1 ఓవర్లలోనే ఛేదించి గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. ఛేదనలో ఘనుడు రిషబ్ పంత్ (125పరుగులు 113బంతుల్లో 16ఫోర్లు, 2సిక్సర్లు నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలబడి గెలుపు లాంఛనాన్ని ముగించాడు. ఇక హార్దిక్ పాండ్యా (71పరుగులు 55బంతుల్లో 10ఫోర్లు)తో కలిసి పంత్ 5వ వికెట్‌కు 133పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పంత్ నమోదు చేయడం ఇండియా విజయతీరాలకు చేరడానికి ఉపయుక్తమైంది. ఇంగ్లాండ్ బౌలర్లో రీస్ టోప్లీ 3, బైడన్ కార్స్ 1, ఓవర్టన్ 1 వికెట్ తీశారు.
ప్రారంభంలో భారీ షాక్‌లు
ఇండియాకు ఛేదన ప్రారంభంలో భారీ షాక్‌లు తగిలాయి. రెండో వన్డేలో చెలరేగిన రీస్ టోప్లీ మూడో వన్డేలో మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. అతను తన తొలి స్పెల్‌లో శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (17పరుగులు 17బంతుల్లో 4ఫోర్లు), విరాట్ కోహ్లీ (17పరుగులు 22పరుగులు 3ఫోర్లు)లను ఔట్ చేశాడు. 10ఓవర్లు ముగియకుండానే ఈ ముగ్గురు పెవిలియన్ బాట పట్టారు. ఈ ముగ్గురిని టోప్లీ బురిడీ కొట్టించాడు. దీంతో ఇండియా 38పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఇక సూర్యకుమార్ యాదవ్ (16పరుగులు 28బంతుల్లో 1ఫోర్ ) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో 72పరుగులకు 4వికెట్లు కోల్పోయిన ఇండియా ఇక గట్టెక్కడం కష్టమేననిపించింది.
వన్డేల్లో తన తొలి సెంచరీ నమోదు చేసిన పంత్
హార్దిక్ ఔటవ్వడంతో మళ్లీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మరో 55పరుగులు అవసరమైన దశలో ఔటవ్వడంతో మ్యాచ్ చాలా ప్రెషర్ భరితంగా సాగింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న రిషబ్ పంత్ మాత్రం చాలా నిబ్బరంగా ఆడుతూ.. స్కోరు బోర్డును లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో డేవిడ్ విల్లీ బౌలింగ్లో పంత్ కొట్టిన సిక్స్.. ఈ మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పాలి. ఇక ఓవర్టన్ బౌలింగ్లో 97పరుగుల వద్ద త్రుటిలో క్యాచ్ ఔట్ నుంచి పంత్ బతికిపోయాడు. ఆ బంతికి రెండు పరుగులు తీసిన పంత్ తర్వాతి బంతికి సింగిల్ తీసి.. వన్డేల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు.
డేవిడ్ విల్లీ వేసిన వరుసగా 5ఫోర్లు బాదిన పంత్
ఇక సెంచరీ తర్వాత పంత్ వీరలెవెల్లో రెచ్చిపోయాడు. డేవిడ్ విల్లీ వేసిన 42వ ఓవర్లో వరుసగా 5ఫోర్లు కొట్టి గెలుపుతీరాలకు ఇండియాను చేర్చాడు. ఒక్కో ఫోర్ ఒక్కో రకమైన షాట్లతో పంత్ అలరించాడు. 43వ ఓవర్లో రూట్ వేయగా.. తనదైన స్టైల్లో పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడి ఫోర్ బాదడంతో ఇండియా అద్భుత విజయం సాధించింది. ఇక బౌలింగ్లో.. ఇంగ్లాండ్‌ను హార్దిక్ పాండ్యా దెబ్బతీశాడు. (7-3-24-4) 7ఓవర్లలో 3మెయిడిన్లు వేసి 4వికెట్లు తీసి కేవలం 24పరుగులే ఇచ్చి చెలరేగాడు. హార్దిక్‌తో పాటు చాహల్ 3, సిరాజ్ 2, జడేజా 1వికెట్లతో రాణించడంతో 45.5ఓవర్లలో ఇంగ్లాండ్ 259పరుగులకు ఆలౌటైంది. ఇక ఆ జట్టు తరఫున కెప్టెన్ జాస్ బట్లర్ (60పరుగులు 80బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ