Ind vs Eng 3rd ODI : ఆ ఛాన్స్ మిస్సవ్వడమే మా కొంపముంచింది.. తమ ఓటమికి కారణాలు చెప్పిన జాస్ బట్లర్

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్‌లో జరిగిన డిసైడర్ మ్యాచ్ అయిన మూడో వన్డేలో భారత్ అద్వితీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత ఇంగ్లాండ్ 259పరుగులు చేయగా.. 260పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి అపురూప విజయాన్ని అందుకుంది. తద్వారా 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఛేదనలో ఘనుడు రిషబ్ పంత్ (125పరుగులు 113బంతుల్లో 16ఫోర్లు, 2సిక్సర్లు నాటౌట్) సెంచరీతో చెలరేగి చివరి వరకు క్రీజులో నిలిచి విజయ లాంఛనాన్ని ముగించాడు. ఇక హార్దిక్ పాండ్యా (71పరుగులు 55బంతుల్లో 10ఫోర్లు)తో కలిసి పంత్ 5వ వికెట్‌కు 133పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మ్యాచ్ ఇండియా వైపు మారడానికి కారణమని చెప్పొచ్చు. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్లోనూ 7ఓవర్లలో 4వికెట్లు తీసి 24పరుగులే ఇచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రిషబ్ పంత్ నిలవగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.

కొన్ని పరుగులు తక్కువ చేశాం
ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. 'మేము బ్యాటింగ్లో కొన్ని తక్కువ పరుగులు చేశామని అనుకుంటున్నా. వాస్తవానికి బౌలింగ్లో మాకు శుభారంభం దక్కింది. దాన్ని మేము కొనసాగించాల్సింది. ఈ వేసవిలో ఇప్పటివరకు మేము జట్టు తరఫున మా అత్యుత్తమ బ్యాటింగ్ చేయలేదు. ఇక మా జట్టు బౌలర్ టాప్లీ అద్భుత ప్లేయర్. చివరి టీ20లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను బౌలింగ్లో తొలుత విరుచుకుపడ్డాడు. అది మా సైడ్ మ్యాచ్ మారడానికి కాస్త ఉపయుక్తమయింది.

రిషబ్ పంత్ స్టంపింగ్ అయి ఉంటే వేరేలా ఉండేది
నిజంగా ఇది కఠినమైన షెడ్యూల్‌గానే ఫీలవుతున్నా. ఇకపోతే మీరు మంచి ఆటగాళ్లకు ఒక్క అవకాశం ఇచ్చినా వాళ్లు చెలరేగుతారు. రిషబ్ పంత్ స్టంపింగ్ నేను మిస్ చేయడం వల్ల అతను చెలరేగి మ్యాచ్ తమ వైపు తిప్పేశాడు. నేను ఆ స్టంపింగ్ చేసుంటే మ్యాచ్ మరో విధంగా ఉండేది. కెప్టెన్సీ పరంగా నా వరకు నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. నేను అనుభవజ్ఞుడైన క్రికెటర్‌ని కానీ యువ కెప్టెన్‌ని. అందువల్ల నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఇక రషీద్ మా జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడు. అతను త్వరలోనే తిరిగి జట్టులోకి రాబోతుండడం మాకు కాస్త కలిసొచ్చే అవకాశమని భావిస్తున్నా.

17 పరుగుల వద్ద పంత్ స్టంపౌట్ మిస్
ఇకపోతే 16వ ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్లో రిషబ్ పంత్.. స్టంపౌట్ మిస్సయ్యాడు. అప్పుడు పంత్ స్కోరు కేవలం 17పరుగులు మాత్రమే. అందివచ్చిన అవకాశాన్ని పంత్ ఏమాత్రం జారవిడవలేదు. హార్దిక్ పాండ్యాతో కలిసి మొండిగా క్రీజులో నిలబడ్డాడు. పంత్ తొలుత ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడే ప్రయత్నం చేయగా.. హార్దిక్ తనదైన స్టైల్లో ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేశాక తమ దూకుడు మొదలెట్టారు. మరో 55పరుగులు ఉండగా హార్దిక్ ఔటయినా.. రవీంద్ర జడేజా (7)తో కలిసి పంత్ కడవరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications