
లండన్: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజులో తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (31), సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (0)లు క్రీజులో ఉన్నారు. అంతకుముందు వికెట్ కీపర్ రిషబ్ పంత్ 37 పరుగులు చేయగా.. పేసర్ మహ్మద్ షమీ (0) డకౌట్ అయ్యాడు. తొలి సెషన్ ఆదిలో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించగా.. చివరలో కోహ్లీసేన పట్టుబిగించింది. మొత్తానికి తొలి సెషన్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది.
276/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శుక్రవారం భారత్ ఆట కొనసాగించింది. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 127తో బ్యాటింగ్ కొనసాగించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) మొదటి బంతికి రెండు పరుగులు తీసి.. రెండో బంతికి ఔటైపోయాడు. ఓలీ రాబిన్సన్ వేసిన రెండో బంతికి రాహుల్ కవర్ డ్రైవ్ ఆడాడు. కానీ షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ డొమినిక్ సిబ్లే చేతుల్లో పడింది. దీంతో భారత్ 278 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
కేఎల్ రాహుల్ ఔట్ అయిన తర్వాతి ఓవర్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే (1: 23 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడి స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కాడు. జేమ్స్ అండర్సన్ ఈరోజు ఆటలో వేసిన తొలి బంతికే రహానేని ఔట్ చేయడం గమనార్హం. గురువారం నాటి స్కోరుకి కనీసం ఒక పరుగు కూడా రహానే యాడ్ చేయలేకపోయాడు. అయితే రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇద్దరు కలిసి దాదాపు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే పంత్ అనుకోకుండా మార్క్ వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మరుసటి ఓవర్‌లోనే మొహ్మద్ షమీ (0) సైతం మోయిన్ అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలోనే జోడీ కట్టిన రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. 276/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ మరో నాలుగు వికెట్లు కోల్పోయి భోజన విరామ సమయానికి 346/7 స్కోర్‌తో నిలిచింది. జడేజా (31), ఇషాంత్ (0) నాటౌట్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్‌సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్, మోయిన్ అలీ చెరో వికెట్ తీశారు.