అదే నాకు ఇంధనంలా పనిచేసింది.. ఇక జట్టులో చోటు సుస్థిరం చేసుకుంటా: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్

లండన్: టెస్ట్ ఫార్మాట్లో వేటు పడటమే బలంగా పునరాగమనం చేసేందుకు ఓ ఇంధనంలా ఉపయోగపడిందని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత జట్టులో తన చోటు సుస్థిరం చేసుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో సెంచరీ చేయడం తనకు మరింత ప్రత్యేకం అని రాహుల్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున రోహిత్ శర్మ చేసిన ముఖాముఖిలో టీమిండియా ఓపెనర్, కర్ణాటక బ్యాట్స్‌మన్ రాహుల్ మాట్లాడుతూ ఫ్లూ విషయాలపై స్పందించాడు.

అదే నాకు ఇంధనంలా పనిచేసింది:
'టెస్టుల్లోంచి తప్పించడం చాలా నిరాశ కలిగించింది. నేను గాయపడ్డాను. ఇందుకు నన్ను తప్ప.. మరెవ్వరినీ నిందించలేను. ఒక అవకాశం కోసం ఎదురు చూశాను. అది నాకెంతో అవసరం. రాగానే అందిపుచ్చుకున్నాను. రెండు టెస్టుల్లో నేను నా బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. లార్డ్స్‌లో శతకం చేయడం మరింత ప్రత్యేకం. నేనెలాంటి ఒత్తిడిని మోసుకురాలేదు. కొన్నిసార్లు గాయపడటం అవసరమే. ఎందుకంటే అది అదనంగా మనల్ని ముందుకు నెడుతుంది. మరింత శ్రమించేందుకు ఇంధనంగా మారుతుంది. నాకిప్పుడు అవకాశం వచ్చింది. జారవిడచాలని అనుకోలేదు' అని లోకేష్ రాహుల్ తెలిపాడు.

ఎన్నో పాఠాలు నేర్చుకున్నా:
ఈ రెండేళ్ల కాలంలో చేసుకున్న మార్పుల గురించి కేఎల్ రాహుల్ వివరించాడు. 'భారత జట్టులో చోటు పోకముందు నేను భిన్నమైన పరిస్థితుల్లో ఆడాను. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో పర్యటించాను. ఆ దేశాల్లో తొలిసారే పర్యటిస్తున్నా.. పరుగులు చేసేందుకే పాకులాడాను. అక్కడి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నా మనసు గందరగోళంగా ఉందని గమనించాను. ప్రతి బంతికి రెండు షాట్లు ఆడాలనిపించేది. అదే పనిగా పరుగుల గురించే ఆలోచించేవాడిని. ఈసారి కేవలం బంతిని చూసి ఆడాలని నాకు నేను చెప్పుకున్నాను. పరుగుల కోసం పాకులాడొద్దని అర్థం చేసుకున్నా' అని పేర్కొన్నాడు.

ఈ మార్పు రాత్రికిరాత్రే రాలేదు:
'నాలో ఈ మార్పు రాత్రికిరాత్రే రాలేదు. ఈ రెండేళ్లలో ఎంతో సాధన చేశాను. ఇతర ఆటగాళ్ల ఆటను చూశాను. పరుగులు చేయడం, ఇన్నింగ్స్ నిర్మించే ప్రక్రియ ఒకటే. అదే నాకు సాయం చేసింది. టెస్టు క్రికెట్ నాకెంతో ఇష్టం. లార్డ్స్‌లో 100 చేశానని కాదు. ఇందులో ఉండే ఆనందం వేరు. టెస్టు క్రికెటర్ అవ్వాలనే నేను ఎదిగాను. నేను పెరిగే క్రమంలో మా నాన్న టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించేవారు. మా కోచ్‌లు సైతం టెస్ట్ ఫార్మాట్లో రాణించాలని పదేపదే చెప్పేవారు. జట్టులో నా స్థానం సుస్థిరం చేసుకుని వారందరిని సంతోషపెట్టాలి. ఇదే నా మనసులో ఉంది' అని కేఎల్ రాహుల్ చెప్పుకోచ్చాడు.

ఇంగ్లండ్‌లో ఆడటం ఎవరికైనా కష్టమే:
అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా ఫామ్‌పై తమకు ఆందోళనేమీ లేదని లోకేష్ రాహుల్ పేర్కొన్నాడు. 'ఎన్నోసార్లు జట్టు కష్టాల్లో పడ్డప్పుడు పుజారా, రహానే ఆదుకున్నారు. వారు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. వారికెంతో అనుభవం ఉంది. ఇద్దరూ తిరిగి ఫామ్‌లోకి రావడానికి రెండు మూడు ఇన్నింగ్సులు చాలు. ఇంగ్లండ్‌లో ఆడటం ఎవరికైనా కష్టమే' అని రాహుల్ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications