
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై ఇంగ్లండ్ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. మూడో రోజు తొలి సెషన్‌లో రాహుల్‌పై షాంపేన్ కార్క్స్ (బీర్ బాటిల్ మూతలు) విసిరారు. రాహుల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చాలా కార్కులు అతడి సమీపానికి వచ్చి పడ్డాయి. కామెంటేటర్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. రెండుసార్లు రాహుల్‌కు దగ్గరగా షాంపేన్ కార్క్స్ విసిరినట్లు కామెంట్రీ బాక్సులో వ్యాఖ్యలు పేర్కొన్నారు. రాహుల్ సమీపంలో చాలా షాంపేన్ కార్క్స్ వచ్చిపడ్డాయి.
ఈ విషయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టికి రావడంతో. అతడు తీవ్రంగా మండిపడ్డాడు. షాంపేన్ కార్క్స్ (బీర్ బాటిల్ మూతలు)ను తిరిగి ఇంగ్లండ్ అభిమానులపైకే విసురు అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎప్పుడూ దూకుడుగా ఉండే కోహ్లీ.. ఈ అంశాన్ని సీరియస్ చేయకుండా విడిచేయడంతో వివాదం సద్దుమణిగింది. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. అందుకే ఇంగ్లీష్ ఫాన్స్ తన కోపాన్ని ప్రదర్శించారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా అభిమానులు మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం అవడంతో ఈసీబీ అభిమానులకు అనుమతిచ్చింది. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి పూర్తిస్థాయి సామర్థ్యంతో ఈసీబీ ప్రేక్షకులను అనుమతించింది. దాంతో కొందరు ఫాన్స్ నియమాలను అతిక్రమించారు. దాంతో పర్యాటక జట్టుపై ఇంగ్లండ్ అభిమానుల అనుచిత ప్రవర్తన మరోమారు బట్టబలైంది. మరి ఈ చర్యకు పాల్పడిన వారిపై ఈసీబీ ఏవైనా చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ రెండో టెస్టులో భారత్‌కు గట్టి పోటీనిస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ జో రూట్ మరోసారి సెంచరీతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 125 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. రూట్ 170, జేమ్స్ ఆండర్సన్ 0 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ 12 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. లోకేష్ రాహుల్ సెంచరీ చేశాడు.
టెస్ట్ ఫార్మాట్లో వేటు పడటమే బలంగా పునరాగమనం చేసేందుకు ఓ ఇంధనంలా ఉపయోగపడిందని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత జట్టులో తన చోటు సుస్థిరం చేసుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో సెంచరీ చేయడం తనకు మరింత ప్రత్యేకం అని రాహుల్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున రోహిత్ శర్మ చేసిన ముఖాముఖిలో టీమిండియా ఓపెనర్, కర్ణాటక బ్యాట్స్‌మన్ రాహుల్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ఓపెనర్లు గిల్, మయాంక్ గాయపడడంతో రాహుల్‌కు అనూహ్యంగా చోటు దక్కిన విషయం తెలిసిందే.