
లండన్: లండన్: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజులో తొలి సెషన్ ముగిసింది. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో నిలిచింది. తొలి సెషన్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ జో రూట్ (89), జానీ బెయిర్‌స్టో (51)లు హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఇప్పటికే శతక భాగస్వామ్యం నిర్మించారు. మరోవైపు భారత బౌలర్లు వీరిద్దరినీ ఔట్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా రూట్, బెయిర్‌స్టోలు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌కు ఇంగ్లండ్ ఇంకా 148 పరుగులు వెనకపడి ఉంది.
శనివారం ఉదయం 119/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో వికెట్ కాపాడుకున్నారు. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 48తో బ్యాటింగ్ కొనసాగించిన రూట్.. ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఫోర్‌తో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌కు ఇది 51వ అర్ధ శతకం. మరోవైపు బెయిర్‌స్టో దూకుడుగా ఆడాడు. రూట్, బెయిర్‌స్టోలు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు వేగంగా కదిలింది.
మరింత జోరు పెంచిన జానీ బెయిర్‌స్టో.. ఇషాంత్ శర్మ వేసిన 71వ ఓవర్ రెండో బంతికి సింగల్ తీసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆపై భోజన విరామంకు వెళ్లారు. జో రూట్, బెయిర్‌స్టో ప్రమాదకరంగా మారుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే 112 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఇక రెండో సెషన్‌లోనూ భారత బౌలర్లు వికెట్లు సాధించకపోతే రూట్ సేన ఆధిక్యంలోకి కూడా వెళ్లేలా కనిపిస్తోంది. మరోవైపు ఏఁఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ (129) సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (83) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో జో రూట్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో జో రూట్‌ని ఈరోజు భారత్ బౌలర్లు త్వరగా ఔట్ చేయగలిగితేనే.. మ్యాచ్‌పై పట్టు దొరకనుంది. రూట్ నెమ్మదిగా ఆడుతున్నా.. జానీ బెయిర్‌స్టో మాత్రం దూకుడుగా ఆడేస్తున్నాడు. బెయిర్‌స్టోను కూడా వీలైనంత త్వరగా ఔట్ చేయాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు ఔట్ అయినా.. స్కోర్ వేగం తగ్గే అవకాశం ఉంది. రెండో సెషన్లో భారత బౌలర్లు సత్తాచాటాల్సిన అవసరం ఎంతో ఉంది.