
లండన్: టీమిండియాతో జరుగుతున్న లార్డ్స్ టెస్టు మూడో రోజు టీ విరామ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ సెంచరీ చేశాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో, ఆల్‌రౌండర్ మొయిన్ అలీలు రాణించారు. తొలి సెషన్ మాదిరే ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లు రెండో సెషన్‌లో సత్తాచాటారు. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా రూట్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ప్రస్తుతం రూట్ (132), అలీ (20) పరుగులతో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో మొహ్మద్ సిరాజ్ 3 మూడు వికెట్లు పడగొట్టగా.. మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.
శనివారం ఉదయం 119/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో వికెట్ కాపాడుకున్నారు. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 48తో బ్యాటింగ్ కొనసాగించిన రూట్.. ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఫోర్‌తో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. మరోవైపు బెయిర్‌స్టో దూకుడుగా ఆడాడు. రూట్, బెయిర్‌స్టోలు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పెట్టింది. ఈ క్రమంలోనే బెయిర్‌స్టో.. ఇషాంత్ శర్మ వేసిన 71వ ఓవర్ రెండో బంతికి సింగల్ తీసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది.
రెండో సెషన్ ఆదిలోనే జానీ బెయిర్‌స్టో (57) ఔట్ అయ్యాడు. మొహ్మద్ సిరాజ్ వేసిన 78.4 ఓవర్‌కు అతడు షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా వేసిన 82వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసిన ఇంగ్లండ్ కెప్టెన్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం చేశాడు. జోస్ బట్లర్ కూడా వికెట్ కాపాడుకుంటూ ఆడాడు. ఈ క్రమంలోనే రూట్ (117) టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇషాంత్ శర్మ వేసిన 91వ ఓవర్ చివరి బంతికి జోస్ బట్లర్ (23) ఔటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ 283 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది. మరోవైపు జో రూట్ మాత్రం పరుగులు చేస్తూ పోయాడు. మోయిన్ అలీ అండతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అలీ కూడా ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 289 పరుగుల వద్ద తేనేటి విరామంకు వెళ్లింది. రూట్, అలీ జోడీ ఇప్పటికే ప్రమాదకరంగా మారింది. వీరిద్దరూ ఇప్పటికే 44 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది.