
లండన్: లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (56 నాటౌట్: 88 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 48తో బ్యాటింగ్ కొనసాగించిన రూట్.. ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఫోర్‌తో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌కు ఇది 51వ అర్ధ శతకం. మరోవైపు స్టార్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతున్నాడు. రూట్, బెయిర్‌స్టోలు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 60 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. రూట్ (66), బెయిర్‌స్టో (37) క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్, జానీ బెయిర్‌స్టో ప్రమాదకరంగా మారుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే 77 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. దాంతో భారత బౌలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. సిరాజ్ పర్వాలేదనిపిస్తున్నా.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఇంకా లయ అందుకోవాల్సి ఉంది. భారత బౌలర్లు వీరి వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ 60 ఓవర్లకు 173/3తో నిలిచింది. భారత్ కన్నా ఇంకా 191 పరుగుల వెనుకంజలో నిలిచింది.
గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో జో రూట్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో.. జో రూట్‌ని ఈరోజు భారత్ బౌలర్లు త్వరగా ఔట్ చేయగలిగితేనే..? మ్యాచ్‌పై పట్టు దొరకనుంది. రూట్ నెమ్మదిగా ఆడుతున్నా జానీ బెయిర్‌స్టో మాత్రం దూకుడుగా ఆడేస్తున్నాడు. బెయిర్‌స్టోను కూడా వీలైనంత త్వరగా ఔట్ చేయాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు ఔట్ అయినా.. స్కోర్ వేగం తగ్గే అవకాశం ఉంది. భారత సత్తాచాటాల్సిన అవసరం ఎంతో ఉంది.
లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆటను భారత్, ఇంగ్లండ్ బౌలర్లు పది వికెట్లతో శాసించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్ శుక్రవారం హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా.. రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి.