టీమిండియా యంగ్ ప్లేయర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను అనుకోకుండా విమానంలో కలుసుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ, తిలక్ వర్మ కలిసి ఓ ఫోటో దిగారు. ఈ విషయాన్ని తిలక్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలియజేస్తూ విజయ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. విజయ్ ను అనుకోకుండా కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన తిలక్, హీరోను సడెన్ గా చూసి షాక్ అయినట్లు తెలిపాడు.
'అన్నా.. నిన్ను విమానంలో అనుకోకుండా కలవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్ను కలవడం గొప్పగా ఉంది.' అని ఇన్‌స్టా స్టోరీస్‌లో విజయ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తిలక్ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, టీమిండియా జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో తలపడనుంది. ఈ సిరీస్‌కు తిలక్ వర్మ సెలక్ట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.
ఇకపోతే గత నవంబర్‌లో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో దక్కించుకోవడంతో తిలక వర్మ కీలకంగా వ్యవహరించాడు. అతడు చివరి రెండు టీ20ల్లోనూ సెంచరీలు బాది ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.
మొత్తంగా కెరీర్ లో తిలక్ వర్మ ఇప్పటి వరకు టీమిండియా తరుపున నాలుగు వన్డేలు, 20 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 4 వన్డేల్లో 22.7 యావరేజ్ తో 68 పరుగులు సాధించాడు. 20 టీ20ల్లో 51.3 యావరేజ్ తో 616 రన్స్ సాధించాడు. వీటిలో రెండు శతకాలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 38 ఐపీఎల్ మ్యాచుల్లో 39.9 యావరేజ్ తో ఆరు అర్ధ శతకాల సాయంతో 1156 పరుగులు సాధించాడు.
ఇంగ్లాండ్ పర్యటకు టీమిండియా స్క్వాడ్ ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).
సిరీస్ షెడ్యూల్ ఇదే..
జనవరి 22న కోల్‌కతా వేదికగా తొలి టీ20 మ్యాచ్,
జనవరి 25న చెన్నై వేదికగా రెండో టీ20 మ్యాచ్,
జనవరి 28న రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 మ్యాచ్,
జనవరి 31న - పుణె వేదికగా నాలుగో టీ20 మ్యాచ్,
ఫిబ్రవరి 2న - ముంబయి వేదికగా ఐదో టీ20 మ్యాచ్.