భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగనున్న అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ఈ వివరాలను ప్రకటించాయి. వచ్చే ఏడాదిలో జూన్ 20న లీడ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. జులై 31న లండన్ వేదికగా చివరి టెస్టు ఆడనుంది.
వచ్చే నెల నుంచి ఆగస్టు-2025 వరకు భారత్ మొత్తంగా 15 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో, వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా అయిదు టెస్టుల చొప్పున రెండు సిరీస్‌లు ఆడనుంది. ఇంగ్లండ్ పర్యటన ప్రారంభానికి ముందు వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా జరగనుంది.

ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ విజయం సాధించి 17 ఏళ్లు గడిచింది. చివరిగా 2007లో టీమిండియా విజయం సాధించింది. గత ఇంగ్లండ్ పర్యటనలో 2021లో అయిదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ సిరీస్‌లో అయిదో టెస్టు ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా పడిన విషయం తెలిసిందే. అప్పటికీ భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
రీషెడ్యూల్‌లో దాదాపు ఏడాది తర్వాత ఆడిన చివరి టెస్టులో భారత్ ఓటమిపాలై సిరీస్‌ను డ్రాగా ముగించింది. కాగా, వచ్చే ఏడాదిలో జరగనున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్-4 ప్రారంభం కానుంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు- జూన్ 20 నుంచి 24, వేదిక: లీడ్స్
రెండో టెస్టు - జులై 2 నుంచి 6, వేదిక: బర్మింగ్‌హామ్
మూడో టెస్టు - 10 నుంచి 14, వేదిక: లండన్
నాలుగో టెస్టు - జులై 23 నుంచి 27, వేదిక: మాంచెస్టర్
ఐదో టెస్టు - జులై 31 నుంచి ఆగస్ట్ 4, వేదిక: లండన్