
లండన్: అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు ప్రకటించిన బెన్ స్టోక్స్ వారసుడిని పట్టుకొచ్చింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. బెన్ స్టోక్స్ ఇచ్చిన స్ట్రాంగ్ స్ట్రోక్ నుంచి తేరుకున్న ఇంగ్లాండ్ బోర్డు.. అతని స్థానాన్ని భర్తీ చేసింది. దీనికోసం కౌంటీ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్‌కు జాతీయ జట్టులో చోటు కల్పించింది. భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోన్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం అతణ్ని ఎంపిక చేసింది.
కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని ప్రకటించింది. బెన్ స్టోక్స్ ఖాళీ చేసిన స్థానాన్ని క్రెగ్ ఓవర్టన్ (Craig Overton)తో భర్తీ చేసింది. క్రెగ్ ఓవర్టన్.. 27 సంవత్సరాల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెటర్. ఆల్‌రౌండర్. బ్యాట్‌తో, బంతితో రాణించే సత్తా ఉంది. కౌంటీల్లో సోమర్సెట్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ఇప్పటిదాకా ఆడింది నాలుగు మ్యాచ్‌లే. 2019లో జాతీయ జట్టు తరఫున నాలుగు టెస్ట్‌మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉంది. నాలుగు టెస్టుల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో తొమ్మిది వికెట్లను పడగొట్టాడు.
కౌంటీ మ్యాచుల్లో నిలకడగా రాణిస్తోన్నాడు. అందుకే- బెన్ స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నర్ స్థానంలో అతణ్ని ఎంపిక చేసింది. ఇదొక లడ్డూలాంటి అవకాశం అతనికి. భారత్ వంటి బలమైన టెస్ట్ మ్యాచ్‌పై రాణించగలిగితే- జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోగలడు. బెన్ స్టోక్స్ మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడతాడనేది స్పష్టంగా తెలియరాని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లాండ్ టీమ్‌లో ఆల్ రౌండర్‌గా నిరూపించుకునే ఛాన్స్ అతని తలుపు తట్టినట్టయింది.

బౌటర్‌గా క్రెగ్ ఓవర్టన్ ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు ఇన్నింగుల్లో తొమ్మిది వికెట్లను పడగొట్టాడు. బౌలింగ్ యావరేజ్ 44.77. ఎకానమీ 3.42. స్ట్రైక్ రేట్ 78.50. బ్యాట్స్‌మెన్‌గా నాలుగు మ్యాచుల్లో ఎనిమిది ఇన్నింగుల్లో 124 పరుగులు చేశాడు. 41 అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్. రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్ యావరేజ్ 20.66. స్ట్రైక్ రేట్ 40.78. అతని ఇన్నింగ్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఓ మోస్తరు రికార్డే ఉన్న ఓవర్టన్ పునరాగమనం ఎలా ఉంటుందనేది ఇంకో నాలుగు రోజుల్లో తేలుతుంది.