
నాటింగ్‌హామ్: భారత సారథి, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా విరాట్‌కి వీరాభిమానులు ఉన్నారంటే అతడి హవా ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక తన అభిమానులను కోహ్లీ ఎప్పుడూ నిరాశపరచడు. సమయం ఉన్నపుడు వారిని ఉత్సహపరుస్తుంటారు. కొందరికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం, మరికొందరికి గిఫ్ట్స్ ఇవ్వడం చేస్తుంటాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కొహ్లీ ఓ అభిమానికి తన షూ ఇచ్చేశాడు.
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ వేయడానికి ముందు ఇరు జట్లు వార్మప్ చేస్టున్నాయి. ఈ సమయంలో ఓ ఇంగ్లండ్ అభిమానికి మైదానంలోనే ఉన్నాడు. అతడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిశాడు. ఆ చిన్నారి అభిమానికి కోహ్లీ తన స్పైక్ షూ బహుమానంగా ఇచ్చాడు. ఆపై ఆ చిన్నారి స్టాండ్స్ వద్దకు వచ్చి తన స్నేహితులతో కలిసి విరాట్ ఇచ్చిన షూతో ఫొటోలు దిగాడు. ఆనందంలో తబ్బిబైనాడు. దీనికి సంబందించిన ఫొటో నెట్టింట వైరల్ అయింది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా మైదానంకు అభిమానులు రావడం లేదు. అయితే భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీసుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అభిమానులను మైదానంలోకి అనుమతించారు. దీంతో చాలా కాలం తర్వాత స్టేడియంలో అభిమానుల సందడి కనిపిస్తోంది. ఇరు జట్ల అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. టెస్ట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల అరుపులు, కేకలతో ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం పూర్తి స్థాయిలో నిండిపోయింది. చాలా మంది భారతీయ అభిమానులు కూడా మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వచ్చారు.
తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ధాటిగా ఆడుతున్న జాక్ క్రాలీ (27) పెవిలియన్ చేరాడు. మొహ్మద్ సిరాజ్ వేసిన 21 ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 24 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో డొమినిక్ సిబ్లీ (18), జో రూట్ (12) ఉన్నారు.