
నాటింగ్‌హమ్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకు వరణుడు అడ్డుపడుతున్నాడు. రెండో రోజులో ఒక సెషన్‌ను తుడిచిపెట్టుకుపోయిన వర్షం.. మూడో రోజులో సగం రోజు ఆటను మింగేసింది. మూడో రోజైన శుక్రవారం ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 11.1 ఓవర్లలో 25/0 స్కోర్‌తో కొనసాగుతోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (11), డామ్ సిబ్లీ (9) నాటౌట్‌గా ఉన్నారు. ఇప్పటికి భారత్ 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (84; 214 బంతుల్లో 12x4), రవీంద్ర జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధ శతకాలతో రాణించగా.. చివరలో జస్ప్రిత్ బుమ్రా (28; 34 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడాడు. ఇంగ్లీష్ బౌలర్లలో ఓలి రాబిన్‌సన్ 5, జేమ్స్ అండర్సన్ 4 వికెట్లు పడగొట్టారు.