
నాటింగ్‌హామ్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం టీమిండియాతో ప్రారంభం అయిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 25 ఓవర్లలో 61 పరుగులు చేసింది. ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (18), కెప్టెన్ జో రూట్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు మరో ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్ కాగా.. స్టార్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ 27 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండానే.. ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆపై భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులేయడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. డొమినిక్ సిబ్లీ నిదానంగా ఆడగా.. జాక్ క్రాలే కాస్త బ్యాట్ జులిపించాడు. అయితే మొహ్మద్ సిరాజ్ వేసిన 21 ఓవర్ చివరి బంతికి క్రాలే క్యాచ్ ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ బంతికి ముందే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ కోల్పోయాడు. తర్వాత కూడా మరో రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు.
జాక్ క్రాలే ఔటవ్వడంతో కెప్టెన్ జో రూట్ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 22 ఓవర్‌లో తొలి బంతికి డొమినిక్ సిబ్లీ ఫోర్ బాదగా..మొహ్మద్ సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్‌లో రూట్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఈ హ్యాట్రిక్ ఫోర్లతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం శార్దూల్ వేసిన ఓవర్‌లో సిబ్లీ రెండు పరుగులు చేశాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 25 ఓవర్లలో 61 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సిబ్లీ, రూట్ క్రీజులో ఉన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా మైదానంకు అభిమానులు రావడం లేదు. అయితే భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీసుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అభిమానులను మైదానంలోకి అనుమతించారు. దీంతో చాలా కాలం తర్వాత స్టేడియంలో అభిమానుల సందడి కనిపిస్తోంది. ఇరు జట్ల అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. టెస్ట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల అరుపులు, కేకలతో ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం పూర్తి స్థాయిలో నిండిపోయింది. చాలా మంది భారతీయ అభిమానులు కూడా మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వచ్చారు.