
నాటింగ్‌హామ్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో జట్టులోకి వచ్చాడు. ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఆల్‌రౌండర్‌లను తీసుకున్నాడు. రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు నిరాశే ఎదురైంది. పేస్ విభాగంలో హైదరాబాద్ గల్లీ భాయ్ మొహ్మద్ సిరాజ్‌కే కోహ్లీ ఓటేశాడు. దీంతో ఇషాంత్ శర్మ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక మరో హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారికి నిరాశే ఎదురైంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారానే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌ను కోహ్లీసేన ప్రారంభింస్తుంది. కాబట్టి ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. సిరీస్ గెలిచి పట్టికలో ఎప్పటిలానే ముందుండాలని భారత్ బావిస్తోంది. ఇక 2018 సిరీస్‌లో ఇంగ్లండ్ గడ్డపై 1-4తో ఎదురైన ఓటమికి ఈ సిరీస్‌తో పగ తీర్చుకోవాలని కూడా కోహ్లీ సేన పట్టుదలతో ఉంది. అయితే సొంత గడ్డపై ఇంగ్లండ్ జట్టును ఓడించడం అంత తేలికకాదు.
ఇంగ్లండ్ భారత్‌కు వచ్చినప్పుడు పూర్తిగా స్పిన్ పిచ్‌లతో వాళ్ల బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఆర్ అశ్విన్ ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లండ్ వంతు వచ్చింది. దీంతో పచ్చికతో కూడిన పేస్ పిచ్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌కు స్వాగతం పలకడానికి ఆ టీమ్ సిద్ధమయింది. ముఖ్యంగా అండర్సన్, బ్రాడ్ లాంటి సీనియర్ బౌలర్లు ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ టెస్ట్‌కు సిద్దం చేస్తున్న పిచ్‌పై పచ్చిక చూస్తుంటే పేస్, స్వింగ్‌కు అనుకూలించవచ్చు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చేతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్, జొస్ బట్లర్, సామ్ కరన్, ఓలీ రాబిన్‌సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.