
లండన్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు.. రెండు జట్లూ గాయలబారిన పడ్డాయి. టీమిండియా ఓపెనర్ మయాంక్ శర్మ నెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడటం జట్టు కూర్పును దెబ్బతీసినట్టయింది. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను రోహిత్ శర్మకు ఓపెనర్ జోడీగా పంపించనుంది టీమిండియా మేనేజ్‌మెంట్. అటు ఇంగ్లాండ్ జట్టు కూడా గాయాలతో సతమతమౌతోంది. ఇప్పటికే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టు నుంచి వైదొలిగాడు.
భారత్ మీద అన్ని రకాల ఫార్మట్లను ఆడిన క్రికెటర్ అతను. తొలిసారిగా బెన్ స్టోక్స్ లేని ఇంగ్లాండ్ జట్టు బలమైన టీమిండియాను ఎదుర్కొనబోతోంది. కౌంటీ క్రికెట్ టీ20 టోర్నమెంట్‌లో సర్రే బ్లాస్ట్ తరఫున మ్యాచ్ ఆడుతున్న సమయంలో గాయపడ్డ ఒల్లీ పోప్.. తొలి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. తొడ కండరాల నొప్పితో అతను ఇబ్బంది పడుతున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది.మిగిలిన నాలుగు మ్యాచ్‌ల కోసం అతనికి విశ్రాంతి ఇవ్వొచ్చని బ్రిటీష్ మీడియా తెలిపింది.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమైన జాక్ క్రాలీ, డామ్ సిబ్లేల్లో ఒకరికి జోడీగా ఒల్లీ పోప్‌ను క్రీజ్‌లోకి దించాలనేది ఇంగ్లాండ్ వ్యూహం. అతను ఫిట్‌గా లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. 19 టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన ఒల్లీ పోప్ 882 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్‌తో ఆరు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడతను ఇప్పటిదాకా సగటున 18.82తో 207 పరుగులు చేశాడు.
భారత్ మీద ఆడిన అనుభవం ఉన్నందు వల్ల పోప్‌తో ఇన్నింగ్‌ను ఆరంభించాలని భావించినా.. చివరి నిమిషంలో అది తేడా కొట్టినట్టయింది. తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టులో జాక్ క్రాలే, డామ్ సిబ్లె, హసీబ్ హమీద్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, సామ్ కుర్రన్, జాక్ లీచ్/డామ్ బెస్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌లో చోటు దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. వారిలో దాదాపు కొత్త ముఖాలే జట్టులో కనిపిస్తోన్నాయి.