దాదాపు 14 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇంగ్లాండ్ తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అతడిపైనే ఉంది. అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు తన పునరాగమనంపై మాట్లాడాడు షమీ. ఏడాది పాటు తాను ఎలా సన్నద్ధమయ్యాడో వివరించాడు. ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసం ఎంతో కీలకమని అన్నాడు.
"బౌలింగ్ చేయడం, కారు డ్రైవింగ్ చేయడం లేదా గాలి పటం ఎగరేయడం.. ఏదైనా సరే చేయాలంటే ముందు మానసికంగా బలంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే మనం ఏ పైనా చేయగలం. పరుగులు చేస్తూ, వికెట్లు తీసే సమయంలో ప్రతిఒక్కరూ మన చుట్టే ఉంటారు. కానీ అసలైన పరీక్ష అది కాదు. కష్ట సమయాల్లో మనతో ఎవరు ఉంటారనేది తెలుసుకోగలగాలి. దాదాపు ఏడాది కాలం పాటు నేను అదే చూశా. చాలా కష్టపడ్డాను. భయంగానే పరిగెత్తాను ఉండేది. ఇప్పుడు ఆ స్టేజ్ దాటేశాను. కఠినంగా శ్రమిస్తేనే.. ఫలితాలు గొప్పగా ఉంటాయి." అని షమీ అన్నాడు.

గత వన్డే వరల్డ్ కప్ తర్వాత మోకాలికి సర్జరీ చేయించుకున్న షమీ ఎనిమిది నెలలుగా ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టులోకి రావడానికి దేశవాళీ ఆడాడు. అందులో అద్భుత ప్రదర్శన చేసి తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇంగ్లాండ్ సిరీస్‌లకు ఎంపికయ్యాడు. ఇప్పుడు అతడు ఈ సిరీస్ లో కీలకంగా రాణిస్తాడని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రెండు వికెట్లు పడగొడితే.. 450 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. తద్వారా అత్యధిక వికెట్లు తీసిన నాలుగో పేస్ బౌలర్‌గా నిలుస్తాడు. చూడాలి మరి ఇప్పుడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో.
ఐసీసీ మంచి రికార్డ్.
ఐసీసీ టోర్నీల్లో మహ్మద్ షమీకి మంచి రికార్డే ఉంది. గత వన్డే వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచుల తర్వాత జట్టులోకి వచ్చినా మంచి ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.