Jasprit Bumrah: ఇదెక్కడి మాస్ బౌలింగ్ బుమ్రా భాయ్.. కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ 110కే ఢమాల్

నెదర్లాండ్స్ లాంటి పిల్ల బచ్చాల మీద 498కొట్టామని జబ్బలు చర్చుకున్న ఇంగ్లాండ్ టీంకు టీమిండియా గట్టి ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న తొలి వన్డేలో ఆ జట్టును పరుగులకే ఆలౌట్ చేసింది. బూమ్ బూమ్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లను తన బుల్లెట్ బంతులతో వణికించాడు. బుమ్రా (7.2-3-19-6) 6వికెట్ల హాల్ ప్రదర్శనకు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఖంగు తిని చెంగు చెంగున ఔటయి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక బుమ్రాకు తోడు షమీ (3వికెట్లు) సైతం పేట్రేగడంతో ఇంగ్లాండ్‌కు బ్యాండ్ బాజా మోగింది.
పాపం క్రీజులోకి వచ్చీ కాసేపు కుదురుకునేంత టైం కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లకు షమీ, బుమ్రా ఇవ్వలేదు. తొలి స్పెల్‌లో వీరిద్దరి దెబ్బకు 26పరుగులకే 5వికెట్లు పుటపుట పడ్డాయి. ఇక జాసన్ రాయ్ (0), బెయిర్ స్టో (7), రూట్ (0), లివింగ్ స్టోన్ (0), బ్రైడన్ కార్స్ (15), డేవిడ్ విల్లీ (21) బుమ్రా దెబ్బకు వికెట్లు ఇచ్చుకున్నారు. బెన్ స్టోక్స్ (0), బట్లర్ (30), ఓవర్టన్ (8)లను షమీ బురిడీ కొట్టించాడు. ఇక 25.2ఓవర్లకే ఇంగ్లాండ్ 110పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు టాప్ స్కోరర్ కెప్టెన్ బట్లర్ (30).

బుమ్రా పేరిట రికార్డుల పరంపర
ఇక బుమ్రా ఈ ప్రదర్శనతో తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన (6/19) కనబరిచాడు. ఇకపోతే ఇంగ్లాండ్ మీద అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్‌గా కూడా బుమ్రా రికార్డ్ నెలకొల్పాడు. ఇంగ్లాండ్ మీద తొలిసారి 6వికెట్లు తీసిన బౌలర్ బుమ్రానే. ఇక బుమ్రా బౌలింగ్లో హైలెట్ ఏంటంటే.. భారీ అంచనాలున్న రాయ్, రూట్, లివింగ్ స్టోన్‌లను గుండు సున్నాకే ఔట్ చేయడం. ఇక తన తొలి స్పెల్లోనే ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీసిన బుమ్రా. 4ఓవర్లలో 6పరుగులకే 4వికెట్లు తీశాడు. రెండో స్పెల్లో మిగతా రెండు వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్లో 3మెయిడిన్లు ఉండడం గమనార్హం. ఇక ఇండియా మీద ఇంగ్లాండ్‌కు వన్డేలో ఇదే అతి తక్కువ స్కోరు. అంతకుముందు 2006లో జైపూర్లో జరిగిన మ్యాచ్‌లో 125పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది.

వచ్చినోళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్వింగ్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్ లేని లోటును కన్పించకుండా బుమ్రా పవర్ ప్లేలో తన నిప్పులు చెరిగే బంతులతో, స్వింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను వచ్చినోళ్లను వచ్చినట్లు పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఇంగ్లాండ్ 26పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. ఇక టాపార్డర్ మొత్తం ఔటవ్వడంతో ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఆ టైంలో క్రీజులో బట్లర్, మొయిన్ అలీ కాసేపు ప్రతిఘటించారు. అయితే మొయిన్ అలీ (14)ని ప్రసీద్ కాట్ అండ్ బౌల్‌గా ఔట్ చేయడంతో ఇక ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది.

కొంపముంచిన బట్లర్ షాట్
ఇక అందరూ బ్యాటర్లు ఔటవ్వడంతో ఉన్నంత సేపు హిట్టింగ్ చేయాలని బట్లర్ పూనుకున్నాడు. అది బట్లర్ కొంపముంచింది. షమీ వేసిన షార్ట్ పించ్ బంతిని హిట్ చేశాడు. ఇక బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో బట్లర్ పోరాటం ముగిసింది. దీంతో స్టేడియంలో ఇంగ్లాండ్ ప్రేక్షకులు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ఇక 59పరుగులకే 7వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. 100పరుగులు దాటిందంటే అది డేవిడ్ విల్లీ, కార్స్ చొరవ వల్లే. వీరిద్దరు 9వికెట్‌కు 35పరుగులు జోడించడతో స్కోరు బోర్డు వంద దాటింది. అయితే బుమ్రా మళ్లీ బౌలింగ్ అందుకోవడంతో వీళ్ల ఆటలు సాగలేదు. దీంతో 110పరుగులకే ఇంగ్లాండ్ చాప చుట్టేసింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లలో నలుగురు డకౌట్ కాగా.. 8మంది ప్లేయర్లు 10పరుగులు కూడా దాటలేదు. అంటే ఇంగ్లాండ్ ఎంత చెత్తగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

తుది జట్లు :
ఇండియా ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ(c), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications