
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ 110పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్టార్ బౌలర్ బుమ్రా ఈ మ్యాచులో అరివీర భీకరంగా చెలరేగిన సంగతి తెలిసిందే. బుమ్రా (7.2-3-19-6) 6వికెట్ల హాల్ ప్రదర్శనతో కెరీర్లోనే తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. బుమ్రా తన 6వికెట్లలో ముగ్గురును డకౌట్ చేయడం గమనార్హం. జాసన్ రాయ్ (0), బెయిర్ స్టో (7), రూట్ (0), లివింగ్ స్టోన్ (0), బ్రైడన్ కార్స్ (15), డేవిడ్ విల్లీ (21)లు బుమ్రా బౌలింగ్‌కు బలయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టుకున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డ మీద వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగో బౌలర్‌గా బుమ్రా రికార్డ్ నెలకొల్పాడు. అతను 6/19ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్ల రికార్డులను ఓ సారి పరిశీలిస్తే.. 1. 2001లో ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో జరిగిన వన్డేలో ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ బౌలర్ వకార్ యూనిస్ 7/36ప్రదర్శనతో అలరించాడు. 2. 1983లో లీడ్స్‌లో విండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో విన్ స్టన్ డేవిస్ ప్రదర్శన (7/51), 3.1975లో లీడ్స్‌లో ఆసీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్ గ్యారీ గిల్మర్ ప్రదర్శన (6/14), 4. 2022లో లండన్లోని ఓవల్‌లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన (6/19).
ఇకపోతే ఇంగ్లాండ్ మీద వన్డేల్లో 6వికెట్లు తీసిన ఏకైక, తొలి ఇండియన్ బౌలర్ కూడా జస్ప్రీత్ బుమ్రానే కావడం విశేషం. అతని బౌలింగ్లో 3మెయిడిన్లు కూడా ఉండడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ 110పరుగులకే కుప్పకూలింది. తద్వారా ఇండియా మీద ఆ జట్టు వన్డేల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసి చెత్త రికార్డ్ మూటగట్టుకుంది.