
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను 110పరుగులకే భారత పేసర్లు ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. బుమ్రా (7.2-3-19-6) 6వికెట్ల హాల్ ప్రదర్శనకు తోడు షమీ (7-0-31-3) 3వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. తొలి స్పెల్‌లో వీరిద్దరు 26పరుగులకే 5వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఇక ప్రసీద్ క్రిష్ణ సైతం (5-0-26-1) 1వికెట్ తీశాడు. వీరి దెబ్బకు ఇంగ్లాండ్‌లోని నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. అలాగే 8మంది బ్యాటర్లు 10పరుగుల లోపే చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియా బౌలర్ల ప్రతాపం ఏ రేంజులో సాగిందో.
ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ పటిమను ఎంత మెచ్చుకున్నా తక్కువే. స్వింగ్ ప్లస్ స్పీడ్ ప్లీస్ లెంత్ కలగలిపి బౌలింగ్ వేయడంతో.. ఇంగ్లాండ్ బ్యాటర్ల వద్ద ఎలాంటి బదులు లేకుండా పోయింది. ఇక బుమ్రా 6/19 ధాటికి ఇంగ్లాండ్.. ఇండియాపై తమ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్ ద్వారా జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇక భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జాబితాలో స్టువర్ట్ బిన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఓసారి టీమిండియా టాప్ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనలను గనుక పరిశీలిస్తే..
భారత్ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలు
1. 2014లో మిర్పూరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో స్టువర్ట్ బిన్నీ అత్యుత్తమ ప్రదర్శన - 6/4
2. 1993లో కోల్‌కతాలో విండీస్‌తో జరిగిన వన్డేలో అనిల్ కుంబ్లే ప్రదర్శన - 6/12
3. 2022లో ఓవల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన - 6/19 (ప్రస్తుత వన్డే)
4. 2003లో డర్బన్లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ఆశిష్ నెహ్రా - 6/23