కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. వ్యక్తిగత రికార్డులతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి భాగస్వామ్యాల్లోనూ రికార్డు సాధించాడు. నాలుగో రోజు ఆటలో జైస్వాల్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు.
31 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో భారత్ తరఫున వేగంగా అర్ధశతకం సాధించిన మూడో బ్యాటర్‌గా శార్దూల్ ఠాకూర్ సరసన మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రిషభ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2022లో బెంగళూరు వేదికగా పంత్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. రెండో స్థానంలో ఉన్న కపిల్ దేవ్ 1982లో కరాచి వేదికగా పాకిస్థాన్‌పై 30 బంతుల్లో 50 సాధించాడు.

ఇక తర్వాతి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్ (31 బంతుల్లో, 20212లో ఓవర్ వేదికగా ఇంగ్లండ్‌పై), యశస్వీ జైస్వాల్, వీరేంద్ర సెహ్వాగ్ (32 బంతుల్లో, 2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై) ఉన్నారు. కాగా, రోహిత్-జైస్వాల్ బంగ్లాదేశ్‌పై కలిసి 18 బంతుల్లోనే అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో 50+ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీల్లో అత్యధిక స్కోరింగ్ రన్ రేట్‌తో పరుగులు చేసిన జంటగా రోహిత్-జైస్వాల్ నిలిచారు.
వీరిద్దరు 23 బంతుల్లో 14.34 నెట్‌రన్ రేటుతో 55 పరుగులు చేశారు. అంతకుముందు ఈ రికార్డు స్టోక్స్ -డకెట్ పేరిట ఉండేది. ఈ ఇంగ్లిష్ ప్లేయర్లు 44 బంతుల్లో 11.86 నెట్ రన్‌రేటుతో అజేయంగా 87 పరుగులు చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డ్రాగా ముగించకుండా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఆడుతోంది. సోమవారం ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 26 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్, షాద్మాన్ ఇస్లామ్ (7) ఉన్నారు. బంగ్లా ఇంకా 26 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 107/3తో ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో సత్తాచాటాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా 34.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిబంగ్లాదేశ్ కంటే 52 పరుగుల ఆధిక్యం సంపాదించింది. యశస్వీ జైస్వాల్ (72; 51 బంతుల్లో, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (68; 43 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహది హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. కాగా, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రే ఆట కొనసాగిన విషయం తెలసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది.