చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. బంగ్లాపై 308 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (33 బ్యాటింగ్; 64 బంతుల్లో, 4 ఫోర్లు), రిషభ్ పంత్ (12 బ్యాటింగ్; 13 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఉన్నారు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్.. జస్‌ప్రీత్ బుమ్రా (4/50), ఆకాశ్‌దీప్ (2/19), రవీంద్ర జడేజా (2/19), మహమ్మద్ సిరాజ్ (2/30)ల ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం దక్కింది.

అయితే ఈ టెస్టులో కోహ్లి విఫలమైనా అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే ఔటైన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో అంపైర్ తప్పిదంతో 17 పరుగులకు వెనుదిరిగాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 12వేల పరుగులు సాధించాడు. సొంతగడ్డపై ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ సరసన కోహ్లి నిలిచాడు.
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో సొంతగడ్డపై 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న అయిదో బ్యాటర్‌గా విరాట్ కోహ్లి చరిత్రకెక్కాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టాప్‌లో నిలిచాడు. సచిన్ 14,192 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (13,117 పరుగులు), జాక్వెస్ కలిస్ (12,305 పరుగులు), కుమార సంగక్కర (12,043 పరుగులు), విరాట్ కోహ్లి (12,006 పరుగులు) ఉన్నారు.
కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఔటైన తీరు చర్చనీయాంశంగా మారింది. స్పిన్నర్ మోహిదీ హసన్ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే ప్యాడ్‌ను బంతి తాకడానికి ముందు కోహ్లి బ్యాటు అంచున తాకింది. సమీక్షకు వెళ్లి ఉంటే కోహ్లి నాటౌట్‌గా మిగిలేవాడు. కానీ కోహ్లి రివ్యూని కోరలేదు. ఎంతో అనుభవం ఉన్న కోహ్లి సమీక్షకు వెళ్లకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.