టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఖాతాలో మరో అరుదైన రికార్డు వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 27వేల పరుగులు వేగంగా పూర్తిచేసిన ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సచిన్ రికార్డును విరాట్ బద్దలుకొట్టాడు.
కోహ్లి 594 ఇన్నింగ్స్‌ల్లో 27వేల పరుగులు సాధించగా, సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో వరుసగా శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర (648 ఇన్నింగ్స్‌లు), ఆస్ట్రేలియా దిగ్గజ రికీ పాంటింగ్ (650 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 27వేల మార్క్‌ను అందుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి ఘనత సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి (27,012) కంటే ముందు సచిన్ (34,357), సంగక్కర (28,016)పాంటింగ్ (27,483) ఉన్నారు. కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లి తృటిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. 35 బంతుల్లో 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డ్రాగా ముగించకుండా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఆడుతోంది. సోమవారం ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 26 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్, షాద్మాన్ ఇస్లామ్ (7) ఉన్నారు. బంగ్లా ఇంకా 26 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 107/3తో ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో సత్తాచాటాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా 34.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిబంగ్లాదేశ్ కంటే 52 పరుగుల ఆధిక్యం సంపాదించింది. యశస్వీ జైస్వాల్ (72; 51 బంతుల్లో, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (68; 43 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహది హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. కాగా, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రే ఆట కొనసాగిన విషయం తెలసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది.