బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ రికార్డుల మోత మోగించింది. పూర్తి సభ్యత్వ దేశాల్లో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నిలిచింది.అలాగే 200+ స్కోరు అత్యధిక సార్లు చేసిన టీమ్‌గా వరల్డ్ రికార్డు సాధించింది.
అయితే ఈ రికార్డులకు జట్టుగా పోరాడాలనే సమష్టితత్వం, కోచ్ గౌతమ్ గంభీర్ కారణమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. జట్టు కంటే ఎవరూ ఎక్కువ కాదని గంభీర్ చెప్పిన మాటలే మరింత ఉత్సాహంతో ఆడేలా చేస్తున్నాయని తెలిపాడు. ''జట్టుగా మేం ఎన్నో ఘనతలు సాధించాం. నా జట్టులో నిస్వార్థ క్రికెటర్లు ఉండాలని కోరుకుంటున్నాను. నిస్వార్థంగా జట్టు ఉండాలని భావిస్తున్నాను. హార్దిక్ చెప్పినట్లుగా మైదానంలో, వెలుపల ఒకరి ప్రదర్శన మరొకరు ఆస్వాదించాలి. వీలైనెంత ఎక్కువ సమయాన్ని గడపాలి''

''శ్రీలంకతో సిరీస్ సమయంలో గౌతమ్ గంభీర్ చెప్పినట్లుగానే జట్టులో అదే వాతావరణం కొనసాగేలా చేస్తున్నాం. జట్టు కంటే ఎవరూ ఎక్కువ కాదని గంభీర్ చెప్పాడు. మీరు 99 వద్ద లేదా 49 వద్ద ఉన్నా సరే, బౌండరీ అవతలకు బంతిని పంపే అవకాశం వస్తే పంపియ్యాలి. ఇవాళ సంజు శాంసన్ అదే చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది. జట్టుగా ఈ సిరీస్‌లో గొప్ప ప్రదర్శన చేశాం'' అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 297 పరుగులు చేసింది. సంజు శాంసన్ (111; 47 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ (75; 35 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (47; 18 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (34; 13 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. బంగ్లా బౌలర్లలో తంజీమ్ హసన్ షకిబ్ మూడు వికెట్లు, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 164 పరుగులకే పరిమితమైంది. తౌహిద్ హృదోయ్(63 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), లిటన్ దాస్ (42; 25 బంతుల్లో, 8 ఫోర్లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, మయాంక్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు.